మీకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటాం!
● ఎంపీ నిధులతో ఆదరంలో ఆర్వో ప్లాంట్ ప్రారంభం ● ప్రారంభించిన ఎంపీ గురుమూర్తి, సమన్వయకర్త నూకతోటి రాజేష్
కేవీబీపురం: ‘రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం ద్వారా కూటమి ప్రభుత్వ ఆగడాలు మీతిమీరుతున్నాయి. వీటన్నింటినీ వైఎస్సార్‌సీపీ శ్రేణులు దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా నిలుస్తాం’ అని ఎంపీ గురుమూర్తి, నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ పిలుపునిచ్చారు. మండలంలోని ఆదరం గ్రామంలో ఎంపీ నిధులు రూ.11.64 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ను సోమవారం వారు ప్రారంభించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో స్థానిక గ్రామస్తులు తాగునీటి ఇబ్బంది గురించి ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన తన నిధుల ద్వారా సమస్యను పరిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు తెలుగుగంగ నీటిని కాళంగి రిజర్వాయర్‌కు రప్పిస్తే 17వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారని, ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఎంపీ నిధుల ద్వారా ఇప్పటికే నియోజకవర్గంలోని ఏడు మండలాలకు వీధిలైట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మునిలక్ష్మీ నందకుమార్, జెడ్పీటీసీ మూర్తి మునెమ్మ, మండల పార్టీ కన్వీనర్ గవర్లకృష్ణయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధవిరెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు ధనంజయులురెడ్డి, పార్టీ కార్యదర్శి లాల్‌బాబుయాదవ్, నియోజకవర్గ ఐటీ విభాగం అధ్యక్షుడు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు శాస్త్రిరాజు, వైస్ ఎంపీపీ శ్రీనివాసయాదవ్, నాయకులు దశరథరామిరెడ్డి, మోహన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.


