జులై 9న అంగన్‌వాడీల సమ్మె
తిరుపతి కల్చరల్ : రాష్ట్రంలోని అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా జులై 9వ తేదీన ఒక రోజు సమ్మె చేపడుతున్నట్లు ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ తెలిపారు. వేమన విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన అంగన్‌వాడీల రాష్ట్ర శిక్షణ తరగతులను శుక్రవారం ఆమె ప్రారంభించి ప్రసంగించారు. వేతనాల పెంపుపై ఏడాది పాటు పెద్ద ఎత్తున సమ్మె చేసినా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం వేతనాల పెంపుపై ఇప్పటి వరకు జీఓ విడుదల చేయకపోవడం దారుణమన్నారు. జులై 9వతేదీ లోపు అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి మాట్లాడుతూ.. అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు కేఎన్‌ఎన్.ప్రసాదరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.బాలసుబ్రమణ్యం ‘యుద్ధం తదనంతర పరిణామాలు, శాసీ్త్రయ ఆలోచనా విధానం వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నేతలు లక్ష్మీదేవమ్మ, రాజేశ్వరి, ఇంద్రాణి, హైమావతి, సౌజన్య, రేవతి, నాగరాజమ్మ, అంగన్‌వాడీ వర్కర్లు పాల్గొన్నారు.


