
ఉపగ్రహాల నిఘా వ్యవస్థ బలోపేతం దిశగా ఇస్రో
● 18న పీఎస్‌ఎల్‌వీ సీ61 ద్వారా కక్షలోకి ఈఓఎస్ ఉపగ్రహం
సూళ్లూరుపేట: ఉపగ్రహాల నిఘా వ్యవస్థ బలోపతం, వాటి విస్తరణ వేగవంతం చేసేదిశగా ఈనెల 18న ఉదయం 6.59 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ61 రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈఓఎస్ రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని సూర్య–సమకాలిక కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈఓఎస్–09 (రీశాట్–1బీ) రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం బరువు 1710 కిలోలు. జాతీయ భద్రతను బలోపేతం చేయడం, కీలక మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో దోహదపడుతుందని ఇటీవల ఇస్రో చైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ తెలిపారు. ఈఓఎస్–09తో ఇస్రో పౌర,వ్యూహాత్మక ప్రయోజనాల కోసం అంతరిక్ష ఆస్తులను ఉపయోగించడంలో దాని సౌంకేతిక నైపుణ్యం, నిబద్ధతను ప్రదర్శిస్తుంది.
రాబోయే ఐదేళ్లలో 52 ప్రైవేటు ఉపగ్రహాలకు..
భవిష్యత్తులో భారత్ ప్రపంచంలోనే బలీయమైన శక్తిగా అవతరించేందుకు అంతరిక్షంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆదనంగా మరిన్ని ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలను రచిస్తోంది. ఇందులో భాగంగా రాబో యే అయిదేళ్లలో ప్రైవేటు రంగం నుంచి బలమైన భాగస్వామ్యంతో 52 ఉపగ్రహాల సమూహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టే దిశగా ఇస్రో అడుగులు వేస్తుంది.ఈనెల జూన్, జులై నెలల్లో హై ప్రొఫైల్ మిషన్ల ప్రయోగాలకు సన్నాహాలు చేస్తున్నారు.