
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
నాయుడుపేటటౌన్ : గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన గురువారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ఆర్ముగం నగర్‌కు చెందిన వృద్ధుడు రవికుమార్(65) కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. అతనికి కళ్లు సరిగా కనిపించవు. ఈక్రమంలో బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. గురువారం ఉదయం శ్రీకాళహస్తి బైపాసు రోడ్డు సమీపంలో కార్తికేయ హోటల్ దగ్గరలో రోడ్డు పక్కన వృద్ధుడు మృతి చెంది ఉండడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. ఈ మేరకు మృతుడి కుమారుడు మేఘవర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ప్రైవేటు బస్సు చోరీ
తిరుపతి క్రైమ్: నగరంలోని ప్రైవేటు ట్రావెల్స్ బస్సును దొంగిలించిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. రేణిగుంటకు చెందిన ముస్తఫా గత ఒకటిన్నర నెల నుంచి యూనివర్సల్ బస్సు ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. టీఎన్02బీయూ 1030 నంబరు గల బస్సును ట్రిప్ నుంచి వచ్చాక చింతలచేను రోడ్డులో పార్కింగ్ చేసేవారు. రోజువారీలాగానే డ్రైవర్ శ్రీధర్, క్లీనర్ విజయ్ బస్సును పార్కిగ్ స్థలంలో ఆపి వెళ్లారు. బుధవారం రాత్రి పార్కింగ్ యజమాని ట్రావెల్స్ మేనేజర్ మునిరాజాకు ఫోన్ చేసి మీ బస్సును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని చెప్పాడు. దీంతో తనతో పాటు సాయిఈశ్వర్ ట్రావెల్స్ యజమాని మునిప్రసాద్, సెల్వకుమార్ చుట్టుపక్కల అంతా వెతికారు. బస్సు కనిపించకపోవడంతో యజమాని రవీంద్రకు తెలియజేశారు. అనంతరం గురువారం ఈస్ట్ స్టేషన్‌లో బస్సు యజమాని ఫిర్యాదు చేయగా దీనిపై కేసు నమోదు చేశారు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూలైన్ ఏటీజీహెచ్ వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 80,964 మంది స్వామివారిని దర్శించుకోగా 32,125 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.24 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతుండగా, టికెట్లు లేని భక్తులకు 15 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.