
సిఫార్సులకే కార్పొరేషన్ రుణాలా!
● ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరుపై నీలినీడలు ● దరఖాస్తుల ప్రక్రియ నుంచే అక్రమాలకు తెరలేపిన కూటమి ప్రభుత్వం ● రెండు రోజుల పాటు పనిచేయని సర్వర్లు ● 1,267 యూనిట్లకు 5,600 దరఖాస్తులు ● అంతటా గోప్యత పాటిస్తున్న అధికారులు
తిరుపతి అర్బన్: ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై గంపెడాశలు పెట్టుకున్న లబ్ధిదారులకు అధికారులు మొండి చేయి చూపేలా ఉన్నారు. మూడు రోజుల పాటు సర్వర్లు పని చేయకపోవడంతో పలువురు అర్హత ఉన్నా.. దరఖాస్తులు చేసుకోలేని దుస్థితి నెలకొంది. దీంతో దరఖాస్తులకు గడువు పెంచుతారని అంతా భావించగా.. ఆ ఊసేలేదు. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చారు. ఈ నెల 9, 10 తేదీల్లో సర్వర్లు పని చేయకపోవడంతో పలువురు నిరాశ చెందారు. ఆ రెండు రోజులకు బదులు మరో రెండు రోజులు గడువు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
రుణాలు ఎప్పుడిస్తారో..!
జిల్లాలో 1267 యూనిట్లుకు 5,600 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 10వ తేదీ నాటికి దరఖాస్తులకు గడువు ముగిసింది. ఈ నెల 9న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. అర్హులైన వారికి ఈ నెల 20వ తేదీకల్లా రుణాలు మంజూరు చేయాలని ఈడీ చెన్నయ్యకు ఆదేశాలు ఇచ్చారు. అయితే కార్పొరేషన్ అధికారులు మాత్రం కలెక్టర్ ఆదేశాలను పక్కన పెట్టి ప్రజాప్రతినిధుల సిఫార్సు లెటర్ల కోసం ఎదురు చూస్తున్నట్లు చర్చ సాగుతోంది. కూటమి నేతలు ఇచ్చిన జాబితా ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలతో పనిలేకుండా పార్టీ నేతల సిఫార్సులకే తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అధికారులే బాహాటంగా చెప్పేస్తున్నారు. అర్హతలతో పని లేకుండా నేతలు చెప్పినవారికే ఇచ్చేటప్పుడు తమకు ఆశలు కల్పించడం ఎందుకని పలువురు దరఖాస్తుదారులు విమర్శిస్తున్నారు.
టెక్నికల్ సమస్యలు ఉన్నాయి
రాష్ట్రస్థాయి అధికారుల ఉత్తర్వుల మేరకు ఎంపిక చేస్తాం. ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలకు సంబంధించి ఈ నెల 10 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 9, 10 తేదీల్లో పలుచోట్ల సర్వర్లు పనిచేయలేదు. అంతేకాకుండా టెక్నికల్ సమస్యలు చోటు చేసుకున్నాయి. కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ నెల 20వ తేదీకి పూర్తి చేయమని చెప్పారు. అయితే రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందిన వెంటనే ప్రక్రియను ప్రారంభిస్తాం. సిఫార్సు లెటర్లకు ప్రాధాన్యత ఉండదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన వారికే రుణాలు అందిస్తాం.
– చెన్నయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, తిరుపతి జిల్లా
అంతా గోప్యంగా..
కార్పొరేషన్ అధికారులు రాయితీ రుణాలకు సంబంధించి అన్ని అంశాలను గోప్యంగా ఉంచుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 10వ తేదీ నాటికి దరఖాస్తులకు గడువు ముగియగా.. ఆ తర్వాత ఎన్ని దరఖాస్తులు వచ్చాయో మీడియాకు కూడా సమాచారం ఇవ్వడం లేదు. అంతేకాదు ఎప్పటి నుంచి ఇంటర్వ్యూలు మొదలు కానున్నాయో అనే సమాచారాన్ని చెప్పడం లేదు. అసలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారా ? లేదా ? నేతల సిఫార్సులు లేఖలు ఉన్నవారికే నేరుగా ఇచ్చేస్తారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

సిఫార్సులకే కార్పొరేషన్ రుణాలా!