
రేషన్ బియ్యం పక్కదారి పడితే చర్యలు
● జిలా కలెక్టర్ వెంకటేశ్వర్
వాకాడు: పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. గురువారం ఆయన వాకాడులోని సివిల్ సప్‌లై గోడౌన్(ఎంఎల్‌ఎస్ పాయింటు)ను తనిఖీ చేశారు. అనంతరం బియ్యం నాణ్యత, బియ్యం బస్తాల తూకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బియ్యం నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గోడౌన్‌లోని పలు రికార్డులు పరిశీలించారు. తాను ఇక్కడికి వస్తున్నానని తెలుసుకుని ఎప్పటి నుంచో రాయాల్సిన రికార్డులు రాయకుండా ఇప్పటికిప్పుడు హడావుడిగా ఒకే రకం పెన్‌తో రికార్డుల్లో రాశారని తెలిపారు. ఈ గోడౌన్‌పై అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నారని.. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే ఉద్యోగం ఊడుతుందని గోడౌన్ ఇన్‌చార్జ్ వెంకటేశ్వర్లును హెచ్చరించారు. గత రెండున్నరేళ్లుగా ప్రజలకు అందాల్సిన 7.5 టన్నుల కందిపప్పు అందజేయకుండా ఎందుకు గోడౌన్‌లో నిల్వ ఉంచారని మందలించారు. ప్రైవేట్ వాహనాల్లో బియ్యం తరలిస్తున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయని, ఇకపై ఇలా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనా, తహసీల్దార్ రామయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఏఓ దీప, తదితరులు ఉన్నారు.
కలెక్టర్‌కు మొర పెట్టుకున్న రైతులు
దొరవారిసత్రం : మండలంలోని లింగంపాడు గ్రామంలో ప్రకృతి వ్యవసాయం కింద ఆరు ఎరకాల్లో సాగవుతున్న వివిధ రకాల పంటలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గురువారం వ్యవసాయధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా పలు గ్రామాల రైతులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్థానికంగా డ్రై యంత్రాలు లేనందున దళారుల చేతుల్లో మోసపోతున్నామని, మండలస్థాయిలో డ్రై యంత్రాలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. నెర్రికాలువ నుంచి లింగంపాడు గ్రామంలోని చెరువులోకి సాగు నీళ్లు సరఫరా చేసే సప్లయ్ చానల్ లాక్‌లు దెబ్బతినడం, కాలువ పూడిపోవడంతో చెరువులోకి నీళ్లు రావడం లేదన్నారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో నెర్రికాలువ పొరంబోకు భూమి ఆక్రమణకు గురైందని లింగంపాడు, తల్లంపాడు రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఆయన నెర్రికాలువపై ఉన్న లాక్‌ల మరమ్మతులకు, కాలువలో పూడిక తీతకు ఎఫ్‌డీఆర్ కింద నిధుల కేటాయింపు కోసం ప్రతిపాదనలు పంపాల్సిందిగా సంబంధిత ఇరిగేషన్ ఏఈ రమేష్‌కు ఆదేశించారు. అంతేకాకుండా నెర్రికాలువ పొరంబోకు భూమి ఆక్రమణలను సైతం తొలగించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. లింగంపాడు గ్రామంలో సాగవుతున్న ప్రకృతి వ్యవసాయం గురించి ఏపీ సీఎన్‌ఎఫ్ డీపీఎం షణ్ముగం, ఏడీఏ అనిత వివరించారు. ఆయన వెంట ఏఓ జ్యోతిర్మయి, ఏఈలు ఉమామహేశ్వరి, హరికృష్ణ, ఉషారాణి, మోహన్‌రావు, ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.