
లైసెన్స్ పట్టు..ఉద్యోగం కొట్టు
● హెవీ లైసెన్స్‌కు పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ● 32వ బ్యాచ్‌కు డ్రైవింగ్ స్కూల్‌లో శిక్షణ పూర్తి ● శిక్షణ ధ్రువపత్రాలు జారీ చేసిన డీఎం
తిరుపతి అర్బన్ : జేబులో హెవీ లైసెన్స్ ఉంటే...చేతిలో డ్రైవర్ ఉద్యోగం ఉన్నట్లుగా భావించాలని అలిపిరి డీఎం, అలిపిరి ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపల్ సింగం హరిబాబు పేర్కొన్నారు. అలిపిరి డ్రైవింగ్ స్కూల్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 32వ బ్యాచ్‌కు మంగళవారం డీఎం చేతుల మీదుగా హైవీ డ్రైవింగ్ లైసెన్స్ కోసం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువపత్రాలను జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధ్రువపత్రాలను తిరుపతి ఆర్టీవో కార్యాలయంలో సమర్పిస్తే వెంటనే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికెట్స్ అందిస్తారని స్పష్టం చేశారు.
జిల్లాలో ఏకై క డ్రైవింగ్ స్కూల్
2022 ఫిబ్రవరిలో తిరుపతిలోని అలిపిరి ఆర్టీసీ బస్టాండ్‌లో జిల్లాలోనే ఏకైక డ్రైవింగ్ స్కూల్ ఏర్పా టు చేశారని ప్రిన్సిపల్ వెల్లడించారు. ఒక్కో బ్యాచ్ లో 16 మంది చొప్పున ఇప్పటి వరకు 32 బ్యాచ్‌ల్లో 512 మందికి శిక్షణ ఇవ్వడంతో పాటు సర్టిఫికెట్స్ ఇప్పించామని వెల్లడించారు. ఇందులో 50 శాతం మందికి స్థానికంగా విద్యుత్ బస్సులు, ఆర్టీసీ గ్యారేజ్‌లో, కాల్ డ్రైవర్స్‌గాను, స్కూల్ బస్సు డ్రైవర్లుగాను ఉద్యోగ అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. సాధారణంగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి శిక్షణ తీసుకోవడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉందని చెప్పారు.
నేటి నుంచి శిక్షణ ప్రారంభం
33వ బ్యాచ్‌కి బుధవారం నుంచి శిక్షణ ప్రారంభిస్తామని ప్రిన్సిపల్ చెప్పారు. 34వ బ్యాచ్‌కు ఈనెల 15 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అలిపిరి డిపో అసిస్టెంట్ మేనేజర్ పుష్పలత, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకుడు రాము పాల్గొన్నారు.
24 ఏళ్లు మిలటరీలో పనిచేశా
మిలటరీలో 24 ఏళ్లు పనిచేశా. గతేడాది రిటైర్డ్ కావడంతో తిరుపతికి వచ్చా. అయితే అలిపిరి ఆర్టీసీ డిపోలో హెవీ లైసెన్స్ కోసం డ్రైవింగ్ స్కూల్ నడుస్తున్న సంగతి తెలిసిందే. హెవీ లైసెన్స్ ఉంటే చేతిలో ఉద్యోగం ఉన్నట్లు భావించి 32వ బ్యాచ్‌లో నామమాత్రపు ఖర్చులతో శిక్షణ పూర్తి చేసుకున్నా. – ధనంజయులు,
మాజీ సైనికుడు, తిరుపతి నగరం
వైఎస్సార్‌సీపీ సర్కార్ పునాదే... ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2022 మార్చిలో ఒక్కో జిల్లాకు ఒక్కో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ శిక్షణ స్కూల్స్‌ను నామమాత్రపు ఫీజుతో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎంతో మంది హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌ను సులభంగా పొందుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. వారంతో గత సర్కార్ చేసిన మేలును గుర్తుచేసుకుంటున్నారు.

లైసెన్స్ పట్టు..ఉద్యోగం కొట్టు