
భూములను సారవంతం చేద్దాం
● విత్తనాల కిట్ ప్రయోజనాలను తెలియజేయండి ● వ్యవసాయాధికారులతో కలెక్టర్ సమీక్ష
తిరుపతి అర్బన్ : రసాయనిక ఎరువుల వాడకంతో భూములు నిస్సారంగా తయారు అవుతున్న నేపథ్యంలో పొలాలు సారవంతం చేయడానికి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో అగ్రికల్చర్ అధికారులతో సమీక్షించారు. 30 రకాల పంట విత్తనాలతో కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్న కిట్స్‌ను పంటలు సాగు చేయడానికి 50 రోజుల ముందు చల్లాల్సిన అవసరాన్ని రైతులకు తెలియజేయాలని చెప్పారు. ప్రధానంగా జీలుగ, జనుము , పిల్లిపెసర, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, జొన్నలు, అనప గింజలు, పెసలు, కందులు, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, అరికలు, సాములు తదితర 30 రకాల పంట విత్తనాల కిట్స్‌ను తెప్పించాలని కోరారు. ఇప్పటికే పొదుపు సంఘం సభ్యులు ఇలాంటి కిట్స్‌ను తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని 774 పంచాయతీల్లో ఒక్కో పంచాయితీకి 25కి పైగా కిట్స్ విక్రయించేలా కృషి చేయాలన్నారు. 50 వేల కిట్స్‌ను రానున్న ఖరీఫ్ సీజన్‌కు సిద్ధం చేసుకోవాలని తెలియజేశారు. ఒక్కో కిట్ రూ.1000 చొప్పున రైతులకు విక్రయించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రసాద్‌రావు, ఉద్యానశాఖ అధికారి దశరథరామిరెడ్డి, ప్రకృతి వ్యవసాయ జిల్లా అధికారి షణ్ముగం కిట్స్‌తో కలిగే ప్రయోజనాలను వివరించారు.