తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్జీలు స్వీకరించనున్నారు. గ్రీవెన్స్‌కు అన్నిశాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.
వేదనారాయణుని సేవలో న్యాయమూర్తి
నాగలాపురం: వేదవళ్లీ సమేత శ్రీవేదనారాయణ స్వామి వారిని ఆదివారం తిరుపతి నాలుగో అదనపు జిల్లా జడ్జి జి.అర్చన సేవించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అర్చకులు ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారి చెంగల్‌రాయులు, ప్రధాన అర్చకుడు నాగరాజు భట్టాచార్యులు, ఎస్‌ఐ సునీల్ పాల్గొన్నారు.
పీజీ కోర్సులకు దరఖాస్తుల వెల్లువ
తిరుపతి సిటీ : ఎస్వీయూ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ పీజీసెట్–2025 దరఖాస్తుల గడువు ఆదివారంతో ముగిసింది. అపరాధ రుసుముతో ఈనెల 25వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 153 కోర్సులలో సుమారు 25వేల సీట్లు ఉండగా ఇప్పటి వరకు 24,900 దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాది పీజీ సెట్‌కు 32వేలకు పైగా దరఖాస్తులు రాగా ఈఏడాది 7వేలు తగ్గడం గమనార్హం. దరఖాస్తు చేసుకుని అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి పీజీ సీటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జూన్ 9 నుంచి పరీక్షలు
జూన్ 9 నుంచి 13వ తేదీ వరకు ఏపీ పీజీసెట్– 2025 నిర్వహించనున్నట్లు ఎస్వీయూ వీసీ అప్పారావు, కన్వీనర్ ప్రొఫెసర్ పీసీ వెంకటేశర్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 కేంద్రాలలో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.