
శుభకరం.. విశ్వావసు సంవత్సరం
● శ్రీకాళహస్తీశ్వరాలయంలో
ఘనంగా ఉగాది వేడుకలు
● శాస్త్రోక్తంగా పంచాంగ పఠనం
● అలరించిన కవి సమ్మేళనం
శ్రీకాళహస్తి: విశ్వావసు నామ సంవత్సరంలో అన్నీ శుభసూచనలే దర్శనమిస్తున్నాయని శ్రీకాళహస్తీశ్వరాలయ ఆస్థాన సిద్ధాంతి కరణం లక్ష్మీ సత్యనారాయణశర్మ తెలిపారు. ఆదివారం ముక్కంటి ఆలయంలో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. స్వామివారి సన్నిధి వద్ద పంచాంగ పఠనం చేపట్టారు. రాశుల వారీగా ఫలాలను వివరించారు.ఈ క్రమంలోనే ఊంజల్‌సేవా మండపం వద్ద రాత్రి నిర్వహించిన కవి సమ్మేళనం ఆకట్టుకుంది. అవధాని మేడసాని మోహన్ మాట్లాడుతూ ఈ సంవత్సరంలో రాశులపై దుష్ట ప్రభావం లేదన్నారు. శ్రీకాళహస్తిలో పుట్టినవారికి దక్షిణామూర్తి, జ్ఞానాంబ, శివయ్య అనుగ్రహంతో ఏ కష్టాలైన ఎదుర్కోగలిగిన శక్తి ఉంటుందని వెల్లడించారు. ఈ మేరకు కవులందరూ కవిత్వాలను, భావాలను వినిపించి ప్రేక్షకులను ఉత్తేజపరిచారు. అనంతరం కవులను ఆలయ అఽధికారులు ఘనంగా సత్కరించారు. స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈఓ బాపిరెడ్డి పాల్గొన్నారు.
తుమ్మలగుంటలో వైభవంగా ఉగాది ఆస్థానం
తిరుపతి రూరల్ : తుమ్మలగుంటలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగా వేకువజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి నిత్య కై ంకర్యాలు సమర్పించారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేపట్టారు. అనంతరం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు అందించారు. ఈ క్రమంలోనే వేదపండితులు . శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. పంచాంగ శ్రవణం చేపట్టారు.
ఆదిదంపతుల విహారం
జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారు ఉగాది పర్వదినం పురస్కరించుకుని పురవిహారం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకారం మండపంలో స్వామి అమ్మవార్లకు వివిధ కాల అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి సన్నిధి వద్ద విశేష పూజలు నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ఆదిదంపతులు పురవీధుల్లో ఊరేగారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

శుభకరం.. విశ్వావసు సంవత్సరం

శుభకరం.. విశ్వావసు సంవత్సరం