
ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఏఎస్పీ వెంకటరావు
తిరుపతి ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులో పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 141పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. జనరల్‌లో 41,005 మంది, ఒకేషనల్‌లో 2,977 మొత్తం 43,982 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవ్వాల్సి ఉంది. వీరిలో 1,245 మంది గైర్హాజరైనట్టు ఆర్‌ఐఓ వీ.రమేష్ తెలిపారు. అలాగే మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పట్టుబడిన 8 మంది విద్యార్థులను డీబార్ చేసినట్లు పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షలో భాగంగా మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులకు కెమిస్ట్రి, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ సబ్జెక్టుల్లో పరీక్ష జరుగుతుందని ఆర్‌ఐఓ తెలిపారు.
స్పందనకు 75 ఫిర్యాదులు
తిరుపతి క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 75 ఫిర్యాదులు అందినట్టు ఏఎస్పీలు వెంకటరావు, కులశేఖర్ తెలిపారు. ఇందులో భూతగాదాలు, దొంగతనాలు, ఆస్తివివాదాలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయని చెప్పారు. వీటిని వెంటనే పరిష్కరించేవిధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రేపు శిల్పారామంలో
ప్రాంతీయ డ్వాక్రా బజార్
తిరుపతి అర్బన్: శిల్పారామంలో ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 09 వరకు ప్రాంతీయ డ్వాక్రా బజార్, సరస్ ఫెయిర్– 2023ను భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్), ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి తెలిపారు. 700 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు, రైతు ఉత్పాదక గ్రూప్‌లు వివిధ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు ఉంటాయని వెల్లడించారు.
ప్రతి గర్భిణీకి హెచ్‌ఐవీ పరీక్ష తప్పనిసరి
తిరుపతి తుడా: ప్రతి గర్భిణీకి హెచ్‌ఐవీ పరీక్షలు తప్పనిసరి అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీహరి స్పష్టం చేశారు. తిరుపతిలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సోమవారం జిల్లా స్థాయి ఈఎంటీసీటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ సీ్త్రలతో పాటు వారి భర్తలకు కూడా హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించాలన్నారు. హెచ్‌ఐవీతో పాటు సిఫిలిస్, హెపిటైటిస్ బీ, సీ పరీక్షలు కూడా నిర్వహించాలని సూచించారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ అరుణ సులోచనాదేవి మాట్లాడుతూ జిల్లాలో ప్రతి గర్భిణీ సీ్త్ర మొదటి త్రైమాసికంలో ఇతర రక్త పరీక్షలతో పాటు హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. డాక్టర్ శేషాద్రి మాట్లాడుతూ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లలో హెచ్‌ఐవీ పరీక్షలలో పాజిటివ్ అని గుర్తించిన వారిని ప్రభుత్వ ఆస్పత్రులలోని ఐసీటీసీ కేంద్రాలకు పంపాలని సూచించారు. ఈ సమావేశంలో వైద్య అధికారులు పార్థసారథి, భారతి, ఆనందరావు, అనిల్, భార్గవ్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ డీపీఎం వెంకటరత్నం, సాధీస్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శేషాద్రి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీహరి