వివేకా హత్య కేసులో విచారణను అడ్డుకునేందుకు సునీత కుయుక్తులు | Ys Sunitha Reddy Petition In Telangana High Court On Ys Vivekananda Reddy Murder Case | Sakshi
Sakshi News home page

వివేకా హత్య కేసులో విచారణను అడ్డుకునేందుకు సునీత కుయుక్తులు

Apr 15 2026 6:25 AM | Updated on Apr 15 2026 6:25 AM

Ys Sunitha Reddy Petition In Telangana High Court On Ys Vivekananda Reddy Murder Case

నరహంతకుడు దస్తగిరికి బెయిల్‌ ఇస్తే సునీత కనీసం వ్యతిరేకించలేదు 

వచ్చే ఎన్నికల వరకు కేసు పూర్తి కాకుండా చేసే యత్నం

అందులో భాగంగా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ కుట్రలు 

ఈ కేసులో ఇక విచారణ చేయడానికి ఏమీ లేదని, తదుపరి దర్యాప్తు అవసరం లేదని 

సీబీఐ తేల్చి చెప్పినా కూడా ఆమె పిటిషన్లు వేస్తూనే ఉన్నారు.. 

వచ్చే ఎన్నికల వరకు కేసు ట్రయల్‌ పూర్తి కాకుండా చూడటమే సునీత ప్రధాన ఉద్దేశం 

వైఎస్‌ భాస్కర్‌రెడ్డి తరఫున తెలంగాణ హైకోర్టుకు నివేదించిన న్యాయవాది  

ఇప్పటికే చార్జిషిట్‌ దాఖలు చేశారు.. విచారణ పూర్తయింది కదా 

వైఎస్‌ భాస్కర్‌రెడ్డి బెయిల్‌ కండీషన్లు సడలిస్తే ఇబ్బందేమిటి? 

సీబీఐ, సునీత న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు.. తీర్పు వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణను నర్రెడ్డి సునీత అడుగడుగునా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారని వైఎస్‌ భాస్కర్‌రెడ్డి తరఫున న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు తెలంగాణ హైకోర్టు దృష్టికి తెచ్చారు. వైఎస్‌ వివేకాను తానే గొడ్డలితో నరికానని స్వయంగా ఒప్పుకున్న నరహంతకుడు దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించి నిందితుల జాబితా నుంచి తొలగిస్తే సునీత కనీసం వ్యతిరేకించలేదని న్యాయస్థానానికి నివేదించారు. ట్రయల్‌ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ప్రతీ పిటిషన్‌లో ఇంప్లీడ్‌ అవుతూ విచారణను ఆపడం కోసం సునీత శతవిధాలా కుయుక్తులు పన్నుతూనే ఉన్నారన్నారు. ఈ కేసులో ఇక విచారణ చేయడానికి ఏమీ లేదని, తదుపరి దర్యాప్తు అవసరం లేదని సీబీఐ తేల్చి చెప్పినా కూడా ఆమె పిటిషన్లు వేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల వరకు కేసు ట్రయల్‌ పూర్తి కాకుండా చూడటమే ఆమె ప్రధాన ఉద్దేశమన్నారు. తనకు బెయిల్‌ మంజూరు సందర్భంగా విధించిన షరతులను సడలించాలని కోరుతూ వైఎస్‌ భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజన కళాసికం ధర్మాసనం విచారించింది. ‘మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో ఇప్పటికే విచారణ పూర్తి చేసి చార్జిషిట్‌ కూడా దాఖలు చేశారు కదా..! పిటిషనర్‌ వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ షరతుల సడలింపు కల్పిస్తే ఇబ్బందేమిటి?’ అని ఈ సందర్భంగా సీబీఐ, నర్రెడ్డి సునీత తరఫు న్యాయవాదులను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. గతంలో ఆయన బంధువుల పార్టీ అధికారంలో ఉందన్నారు.. మరి ఇప్పుడు లేదు కదా..! అని వ్యాఖ్యానించింది.  

ట్రయల్‌ను ఆపేందుకు సునీత విశ్వప్రయత్నం 
వైఎస్‌  భాస్కర్‌రెడ్డి తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు వాదనలు వినిపిస్తూ నిందితుల్లో చాలా మందికి లేని షరతులు వృద్ధుడైన భాస్కర్‌రెడ్డికి విధించడం సబబు కాదని నివేదించారు. ‘వైఎస్‌ వివేకా కేసులో సునీత బాధితురాలు కానేకాదు. ఆమెపైనా పలు అనుమానాలున్నాయి. కొందరి రాజకీయ లబ్ధి కోసం కేసు విచారణ పూర్తి కాకుండా చూసేందుకు ఆమె యత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు కేసు ట్రయల్‌ పూర్తి కాకుండా చూడటమే ఆమె ప్రధాన ఉద్దేశం. ఇక విచారణ చేయడానికి ఏమీ లేదని సీబీఐ చెప్పినా కూడా పిటిషన్‌ వేశారు. ట్రయల్‌ కోర్టు ఆ పిటిషన్‌ను పాక్షికంగా అనుమతించి.. ఒకట్రెండు అంశాలపై విచారణకు ఆదేశించింది. సీబీఐ ఆ విచారణ పూర్తి చేసి అదనపు చార్జిషిట్‌ కూడా దాఖలు చేసింది. అయినా కూడా ఇంకా విచారణ చేయాలంటూ సునీత మరో పిటిషన్‌ వేశారు. విచారణ హైదరాబాద్‌కు బదిలీ అయ్యే నాటికి భాస్కర్‌రెడ్డి నిందితుడిగా లేరు. అలాంటప్పుడు ఆయన విచారణను ప్రభావితం చేస్తారనడం అర్హరహితం’ అని నివేదించారు.

చెత్తబుట్టలో వేసినా పిటిషన్లు ఆపడం లేదు
‘సునీత సుప్రీం కోర్టులో చెప్పిందే ఇక్కడ కూడా చెబుతున్నారు. ఆమె ఎంత చెప్పినా, తదుపరి విచారణ కోరినా అత్యున్నత న్యాయస్థానం అంగీకరించలేదు. ట్రయల్‌కోర్టుకే ఆ బాధ్యతను అప్పగించింది. అది కూడా పూర్తయింది. పిటిషనర్‌ జీవితమంతా తన సొంత ప్రాంతంలోనే గడిపారు. వ్యవసాయం చేస్తూ జీవించారు. తిరిగి అక్కడికి వెళ్లాలని కోరుకోవడం ఎంతమాత్రం తప్పుకాదు. సునీత ఇలా పిటిషన్లు వేస్తూ ఏళ్లకు ఏళ్లు ట్రయల్‌ అడ్డుకుంటూ పోతే.. సొంత వారికి దూరంగా పిటిషనర్‌ ఎన్నేళ్లు బతకాలి? చాలా పిటిషన్లను చెత్త బుట్టలో వేసినా.. ఆమె పిటిషన్లు వేయడం మాత్రం ఆపడం లేదు. ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి ఈ కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేసినా జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.

పులివెందుల వెళ్లేందుకు సీబీఐ సాయం ఏమీ అవసరం లేదు. చక్రాల కు ర్చిల్లో తిరిగే వాళ్లు కూడా వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి చూడాలని భావిస్తారు. పిటిషనర్‌ అనారోగ్యంగా ఉన్నా.. అక్కడికి వెళ్లాలని కోరుకోవడం తప్పుకాదు. ఇప్పటివరకు ఒక్క బెయిల్‌ షరతునూ పిటిషనర్‌ ఉల్లంఘించలేదు. సీబీఐ న్యాయవాది, సునీత న్యాయవాది ఒకే వాదన వినిపిస్తున్నారు..’ అని ఉమామహేశ్వర్‌రావు నివేదించారు. కాగా బెయిల్‌ ఇచి్చన నాటి నుంచి పిటిషనర్‌ షరతులు ఉల్లంఘించారా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. లేదని సీబీఐ న్యాయవాది బదులిచ్చారు. అనంతరం న్యాయమూర్తి దీనిపై తీర్పు వాయిదా వేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement