మీ ఫోన్‌ వస్తే భయమేస్తోంది సార్‌.. | Young Man Ends Life In Debt Crisis | Sakshi
Sakshi News home page

మీ ఫోన్‌ వస్తే భయమేస్తోంది సార్‌..

May 29 2026 1:31 PM | Updated on May 29 2026 1:43 PM

Young Man Ends Life In Debt Crisis

 నల్గొండ జిల్లా: ‘మీ ఫోన్‌ వస్తే భయమేస్తోంది సార్‌.. మీ వల్ల నరకం చూశాను.. అధిక వడ్డీకి అప్పులు తీసుకొని తీర్చలేకపోతున్నా.. నా కుటుంబ సభ్యులు నన్ను క్షమించాలి’అని సూసైడ్‌ నోట్‌ రాసి వ్యవసాయాధికారి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే...చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన గుంటోజు బాలరాజు (38) కొన్నేళ్లుగా కేతేపల్లి క్లస్టర్‌ వ్యవసాయ శాఖలో ఏఈఓగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ అవసరాలతోపాటు వ్యవసాయం చేసేందుకుగాను కొందరి వద్ద అప్పుగా డబ్బు తీసుకొని వాటిపై అధిక వడ్డీ భారం మోస్తూ మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. 

బుధవారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహానికి నల్లగొండలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించగా గురువారం ఉరుమడ్లలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చిట్యాల ఎస్‌ఐ మామిడి రవికుమార్‌ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.  

అప్పుల మీద అప్పులు..  
ఆత్మహత్యకు ముందు ఏఈఓ బాలరాజు తొమ్మిది పేజీల సూసైడ్‌ నోట్‌ రాశాడు. అందులో.. అప్పు ఇచ్చిన వారు ఫోన్‌ చేస్తూ ఒత్తిడి చేశారని పేర్కొన్నాడు. తాను పనిచేస్తున్న ప్రాంతంలో మరో వ్యక్తితో కలిసి పదెకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకొని సాగు చేయగా రూ.3 లక్షల నష్టం వచ్చిందన్నాడు. అది పూడ్చుకునేందుకుగాను ఓ చిట్‌ఫండ్‌లో పనిచేసే ఏజెంట్‌ ద్వారా తన తోటి కౌలుదారుతో చిట్టీ వేయించానని, అందుకు తాను ష్యూరిటీ ఉన్నానని, అతడు చిట్టీ డబ్బులు పూర్తిగా కట్టకపోవడంతో రూ.5 లక్షలు చిట్‌ఫండ్‌ కంపెనీకి తానే కట్టాల్సి వచ్చిందని నోట్‌లో పేర్కొన్నాడు. ఈ భారం నుంచి బయటపడేందుకు.. తెలిసిన వ్యక్తుల ద్వారా మారి్టగేజ్‌ లోన్లు, ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద అప్పులు తీసుకొని, వడ్డీలు కట్టలేక మరలా అప్పులు చేయాల్సి వచ్చిందని బాలరాజు వివరించాడు. అధిక వడ్డీలతో సామాన్య ప్రజలను మోసం చేస్తున్న వారిని వదిలిపెట్టొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని సూసైడ్‌ నోట్‌లో కలెక్టర్, ఎస్పీలను కోరాడు.  

Advertisement
 
Advertisement
Advertisement