
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
బషీరాబాద్: తాతను చూసేందుకు నగరం నుంచి వచ్చిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి ఇందర్‌చెడ్ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శంకర్, మృతుడి బంధువులు తెలిపిన ప్రకారం.. మూడు రోజుల క్రితం మండల కేంద్రంలోని జయంతి కాలనీలో నివాసం ఉండే సంకుల బోనప్పను చూసేందుకు తన మనవడు బైలుపాటి రాము(25) హైదరాబాద్ నుంచి వచ్చాడు.
మంగళవారం చేపలు తీసుకువచ్చేందుకు తాతామనుమడు కలిసి బైక్‌పై ఇందర్‌చెడ్ సమీపంలోని చెరువుకు వెళ్లారు. చేపలు విక్రయించే వారు లేక వెనుదిరిగారు. ఈ క్రమంలో ఇందర్‌చెడ్– బషీరాబాద్ మార్గంలో మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాము తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బోనప్ప గాయాలతో పడి ఉండడంతో గమనించిన వాహనదారులు వారి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే వారు అక్కడకు చేరుకుని తాండూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా తల్లిదండ్రులు లేని మృతుడికి భార్య మంగమ్మ గర్భిణి, మూడేళ్ల కూతురు ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.