
స్వగ్రామంలో స్వాతి అంత్యక్రియలు
రాత్రి 10.30 గంటలకు స్వగ్రామం చేరుకున్న మృతదేహం
శరీరభాగాల మూట విప్పకుండానే చితికి నిప్పంటించిన తండ్రి
వికారాబాద్ జిల్లా: భర్త చేతిలో కిరాతకంగా హత్యకు గురైన ఐదు నెలల గర్భిణి స్వాతి అంత్యక్రియలను సోమవారం రాత్రి స్వగ్రామంలో నిర్వహించారు. రాత్రి 10:30 గంటలకు అంబులెన్స్‌లో హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చేరుకున్న స్వాతి మృతదేహాన్ని (శరీరభాగాల మూట) నేరుగా గ్రామంలోని శ్మశానవాటికకు తరలించారు. ఆ మూటను విప్పకుండా అలాగే చితిపై పెట్టి నిప్పంటించారు. తండ్రి రాములు కూతురుకు తలకొరివి పెట్టారు. చివరి చూపునకు కూడా నోచుకోలేకపోతిమి బిడ్డా.. అంటూ కుటుంబ సభ్యులు చేసిన రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య స్వాతి అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిలా ఉండగా నిందితుడు మహేందర్‌రెడ్డి తరఫు వారెవరూ శ్మశానవాటిక వద్దకు రాలేదు.
నిందితుడి ఇంటి వద్ద మృతురాలి బంధువుల ఆందోళన
వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన మహేందర్‌రెడ్డి అదే గ్రామానికి చెందిన స్వాతిని కులాంతర ప్రేమ వివాహం చేసుకుని, అనుమానంతో హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో నిందితుడి తల్లిదండ్రులు ఆదివారమే ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. కాగా, స్వాతి అంత్యక్రియలను మహేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆమె బంధువులు నిందితుడి ఇంటి ఎదుట టెంట్ వేసుకుని ఆందోళన చేపట్టారు. అయితే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భయాందోళనలో ఉన్న నిందితుడి తల్లిదండ్రులు గ్రామానికి వచ్చేందుకు భయపడటంతో గ్రామ పెద్దలు కలి్పంచుకుని స్వాతి తల్లిదండ్రులను శాంతింపజేసి.. అంత్యక్రియలు నిర్వహించేలా ఒప్పించారు.
స్వాతి శరీర భాగాలకోసం కొనసాగుతున్న గాలింపు
మరో పక్క బోడుప్పల్ ఈస్ట్ బాలాజీహిల్స్ కాలనీలో జరిగిన స్వాతి హత్యకేసులో శరీర భాగాల కోసం ప్రతాప సింగారం మూసీకాలువలో రెండో రోజు సోమవారం కూడా డీఆర్‌ఎఫ్ బృందాలు బోట్లతో గాలింపు కొనసాగించాయి. సుమారు 10 కిలోమీటర్ల మేర వెతికినా మృతురాలి శరీర భాగాలు దొరకలేదని మేడిపల్లి పోలీసులు తెలిపారు.