
‘ఆన’వాయితీగా వస్తున్న ఆచారం
కల్లు, మద్యం, మత్తుపదార్థాల జోలికెళ్లరు
వాల్యానాయక్‌తండాలో అనాదిగా వస్తున్న ఆచారం
పెళ్లి జరిపించే రోజునేప్రతిజ్ఞ చేయిస్తున్న పెద్దలు
ఆ క్షణం నుంచే ఆమెకు సీతమ్మతల్లిగా గౌరవం
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం వాల్యానాయక్‌తండాలో అనాదిగా కొనసాగుతున్న ఆచారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ గ్రామానికి కోడలిగా వచ్చే వారిని సాక్షాత్తూ గిరిజన దేవత సీతమ్మగా భావిస్తారు. కొత్త కోడలిగా తండాలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి ఆమె మాంసం, కల్లు, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటుంది. ఇలా తాతల కాలం నుంచి ఈరోజు వరకు తండాకు వచి్చన సుమారు 200 మందికిపైగా ఈ సంప్రదాయాన్ని సంతోషంగా పాటిస్తుండటం గమనార్హం.
దుద్యాల్: గిరిజనులు, లంబాడాలు ఇష్టంగా తినేది మాంసాహారమే. అటవీ ప్రాంతంలో ఉండే వీరికి జంతువులు, పక్షులు, చేపలను వేటాడటం, కోళ్లు, మేకలు, గొర్రెలను పెంచడం వంటివి చిన్నతనం నుంచే అబ్బుతాయి. ఈక్రమంలో మహిళలు, పురుషులు, చిన్నాపెద్దా అనే తేడా లేకుండా వారంలో కనీసం మూడుసార్లయినా మాంసం తింటారు. నీసు(మాసం) లేనిదే ముద్దతిగదని చాలా మంది బహిరంగంగానే చెబుతుంటారు. ఇలాంటి వాతావరణంలో పుట్టి పెరిగిన వారికి ఒక్కసారిగా మాంసానికి దూరంగా ఉండమంటే కష్టమే. కానీ వాల్యానాయక్‌తండాకు కోడలిగా వచ్చేవారు ఎవరైనా మాంసం, మద్యానికి దూరంగా ఉండాల్సిందే. సుమారు రెండు శతాబ్దాలకు పైగా ఈ ఆచారం కొనసాగుతోంది. వివాహం చేసుకునే వరుడు తాళికట్టి, కుంకుమ»ొట్టు పెడితే చాలు కట్టుబాటును పాటించాల్సిందే. అయితే ఇప్పటి వరకూ మహిళలెవరూ దీన్ని కట్టుబాటుగా భావించకపోవడం విశేషం. ఇది ఎక్కడికెళ్లినా తమకు అత్యంత గౌరవాన్ని తెచ్చి పెడుతుందని తండా కోడళ్లు చెబుతున్నారు. ఇతర గ్రామాలు, బంధువుల శుభకార్యాలకు వెళితే తమకు ప్రత్యేక భోజనం వండి పెడుతారని పేర్కొంటున్నారు.
పెళ్లి రోజే ప్రతిజ్ఞ
వాల్యానాయక్‌తండాలో 700 మంది జనాభా ఉంటుంది. ఇంటికి వచ్చే కోడలే తమ వంశాన్ని వృద్ధి చేస్తుందని, ఇంటిల్లిపాదిని తల్లిలా లాలిస్తూ కుటుంబ అభివృద్ధి, అభ్యున్నతికి పాటుపడుతుందని తండావాసుల విశ్వాసం. ఇంటి తీరు వాకిలి చెబుతుందనే విధంగా ఇంట్లోని కోడలు తాతి్వక, సత్వ గుణాలను కలిగి ఉంటే.. భర్త, అత్తామాలను బాగా చూసుకుంటుందని, పిల్లలు సైతం ఆమెను అనుకరిస్తారనేది వీరి నమ్మకం. అందుకే వివాహ నిశ్చయానికి ముందే గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు కొత్త కోడలికి అన్ని విషయాలు చెబుతారు. ఇందుకు ఆమె మనస్పూర్తిగా అంగీకరించిన తర్వాతే పెళ్లి పక్కా చేస్తారు. పెళ్లి కూతురును ముస్తాబు చేసిన తర్వాత.. మాసం, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటానని ఆమెతో ప్రతిజ్ఞ చేయిస్తారు.
ఆచారం వచ్చిందిలా..
సుమారు నూటాయాభై ఏళ్ల క్రితం వాల్యానాయక్‌తండాలో అంటు వ్యాధులు(గత్తర) సోకి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈసమయంలో తమను కాపాడమంటూ గిరిజనులు తమ ఆరాధ్యదైవమైన సీతమ్మను పూజించారు. తాము గత్తర నుంచి బయటపడితే తండాలోని కోడళ్లను మాసం, కల్లు వంటివి మాని్పస్తామని మొక్కుకున్నారు. ఆనాటి నుంచి తండాలో రోగాలు తగ్గి, పంటలు పండాయని, ఆహారం సమృద్ధిగా దొరికిందని వృద్ధులు చెబుతున్నారు.
కరోనా కాలంలోనూ..
ఇటీవల ప్రపంచాన్ని వణికించిన కరోనా కాలంలోనూ తండా కోడళ్లు మటన్, చికెన్, గుడ్డు వంటివి ముట్టుకోలేదు. వైరస్ బారిన పడిన వారికి పోషకాహారం తీసుకోవాలని ఇందులో భాగంగా గుడ్లు, మాంసం తినాలని వైద్యులు సూచించినా ఎవరూ వాటి జోలికి వెళ్లలేదు. తమను అమ్మవారే కాపాడిందని, కాపాడుతుందని చెప్పడం విశేషం. ప్రాణాలుపోయినా పరవాలేదు కానీ ఆచారాన్ని మంటగలిపే పని చేయలేదన్న వీరికి నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందే.
అందరికీ ఆదర్శంగా..
తాతలు, తండ్రుల కాలంలో మదుమాంసాలకు దూరంగా ఉన్న అనేక కుటుంబాల్లోని వారు ప్రస్తుతం వీటిని అలవాటు చేసుకున్నారు. పార్టీలు, దావత్‌ల పేరుతో మద్యం, మాంసానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మేమెందుకు తినకూడదు అని.. ఎదురు ప్రశ్నిస్తున్న సందర్భాలూ లేకపోలేదు. ఇలాంటి తరుణంలో గిరిజన కుటుంబాల్లోని కోడళ్లు వీటిని త్యజించడం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
45 ఏళ్లుగా మాంసానికి దూరం
మా తల్లిదండ్రుల గ్రామం రోటిబండతండా. నా చిన్నతనంలో మాంసం ఇష్టంగా తినేదాన్ని. నాపెళ్లయి 45 ఏళ్లు దాటింది. ఆరోజు నుంచి ఇప్పటి వరకు మాంసం జోలికి వెళ్లలేదు. మా అత్త కూడా మాంసం తినలేదు.
– అస్లీబాయి
తరతరాలుగా వస్తున్న ఆచారం
తండా కోడళ్లు మాంసం తినకూడదనేది తరతరాలుగా వస్తున్న ఆచారం. మాకన్నా పెద్దవాళ్లు పాటించారు.. మేమూ కొనసాగిస్తున్నాం.. ఇప్పటి పిల్లలు కూడా మాతోవలోనే నడవడం సంతోషం కలిగిస్తోంది.
– ప్రమీళాబాయి
అదృష్టంగా భావిస్తున్నా..
నేను పీజీ చదివా.. స్టూడెంట్‌గా ఉన్న రోజుల్లో మాంసాహారం బాగా తినేదాన్ని. నాకు ఇటీవలే పెళ్లయింది. తండా ఆచారాన్ని చెప్పినప్పుడు వింతగా అనిపించినా.. ఇక్కడికి వచ్చాక ఇది ఎంతో అదృష్టమని తెలుసుకున్నా.
– పద్మ
వండుతాం.. కానీ తినం
నేను కూడా మొదట్లో ఇదేం ఆచారం అని విచారపడ్డా. కానీ మాంసం వదిలేసిన కోడళ్లకు ఇక్కడ లభిస్తున్న గౌరవం చూసి ఆ ఆలోచన మారిపోయింది. ఇంట్లో మగవాళ్లు, వచ్చే బంధువులకు వండుతా కానీ నేను తినను.
– శ్రీలత, అంగన్‌వాడీ టీచర్