
వికారాబాద్ జిల్లా గడిసింగాపూర్‌లో ఘటన
పరిగి: పున్నామ నరకం నుంచి రక్షిస్తాడనుకున్న కొడుకు పెన్షన్ డబ్బుల కోసం కన్నతల్లిని చంపిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మిట్టకోడూర్ మల్లమ్మ (57)కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ముగ్గురికీ వివాహాలు కాగా, పెద్ద కుమారుడు ఆంజనేయులు మద్యానికి బానిసయ్యాడు. ఇతని మొదటి భార్య మృతి చెందగా, రెండో భార్య విడాకులు తీసుకుంది.
ఎలాంటి సంపాదన లేకపోవడంతో తల్లికి వచ్చే ఆసరా పెన్షన్ డబ్బులు లాక్కుని నిత్యం మద్యం తాగేవాడు. ఇటీవల పెన్షన్ రావడంతో గత బుధవారం సాయంత్రం డబ్బులు ఇవ్వమని అడగ్గా.. ఆమె నిరాకరించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆంజనేయులు విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రగాయాలపాలై మరుసటి రోజు శుక్రవారం ఇంట్లోనే చనిపోయింది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. చిన్న కుమారుడు మహిపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపర్చిన అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.