యాసంగి కొనుగోళ్లు అంతంతే | Yasangi Paddy Procurement: Telangana Government to Procure 90 Lakh Tonnes of Paddy | Sakshi
Sakshi News home page

యాసంగి కొనుగోళ్లు అంతంతే

Apr 21 2026 12:49 AM | Updated on Apr 21 2026 12:49 AM

Yasangi Paddy Procurement: Telangana Government to Procure 90 Lakh Tonnes of Paddy

ఉమ్మడి నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లోనే కొనుగోళ్లు మొదలు 

90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం 

ఇప్పటికి కొన్నది 2.51 ఎల్‌ఎంటీ మాత్రమే  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి వరికోతలు మొదలైనా, ఆ స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. చాలా జిల్లాల్లో రైతులు వరి కోసి, ధాన్యాన్ని రోడ్ల పక్కన ఆరబెట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కేవలం ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలతోపాటు ములుగు, మెదక్‌ జిల్లాల్లోని కొన్ని కొనుగోలు కేంద్రాల్లో 25,452 మంది రైతుల నుంచి 2,50,938 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ ఇప్పటి వరకు కొనుగోలు చేసింది. చాలా జిల్లాల్లో రైతులు వరికోతలు పూర్తి చేసి ధాన్యాన్ని ఆరబెట్టి, కుప్పలుగా పోసి కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తున్నారు. చాలా జిల్లాల్లో పీఏసీఎస్‌లు, ఐకేపీ సహకార సంఘాలు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన స్థలాలను కూడా ఫైనలైజ్‌ చేయలేదని క్షేత్రస్థాయి పరిశీలనతో తేలింది.  

90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం 
రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్‌లో 64 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. కోటి మెట్రిక్‌ టన్నుల కన్నా అధికంగా ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ లెక్కలు వేస్తోంది. ఇందులో నిజామాబాద్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో సన్న ధాన్యాన్ని ప్రైవేట్‌ వ్యాపారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు. ఇతర ప్రైవేట్‌ కొనుగోళ్లు, రైతుల వ్యక్తిగత అవసరాలు పోగా 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ భావిస్తోంది.

8వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్‌ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఏప్రిల్‌ మొదటి వారంలోగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, ఇప్పటి వరకు కేవలం 3,310 కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు పూర్తి చేశారు. అందులో సుమారు 1,000 లోపు కేంద్రాల్లోనే కొనుగోళ్లు సాగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.  

ఎదురు చూస్తున్న రైతులు 
ప్రస్తుతం నిజామాబాద్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లోనే 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ములుగు, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కలిపి 400 మెట్రిక్‌ టన్నులే కొన్నారు. మిగతా 25 జిల్లాల్లో ఎక్కడా ఒక్క కిలో ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో వరికోతలు కొంత ఆలస్యంగా సాగైనా, పెద్దపల్లి, జగిత్యాల, జనగామ, ఖమ్మం, మెదక్, నారాయణపేట, సిద్దిపేట తదితర జిల్లాల్లో ఇప్పటికే కోతలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.

కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర కింద ఏ గ్రేడ్‌ ధాన్యం క్వింటాల్‌కు రూ.2,389 ఉంటే, సాధారణ ధాన్యం రూ.2,369లకు విక్రయించే అవకాశం ఉంది. అయితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ధాన్యాన్ని దళారులు మిల్లర్లకు తక్కువ ధరకు విక్రయించుకుంటారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా పౌరసరఫరాల సంస్థ అవసరమైన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement