
హనుమకొండ జిల్లా వేలేరు మండలం లోక్యాతండా గ్రామంలోని తిప్పాయకుంట చెరువులో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు
మట్టి పనుల్లో ‘మేము సైతం’ అంటున్న మహిళలు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో వారిదే ఆధిక్యం
దేశవ్యాప్తంగా 27.64 కోట్ల మంది.. అందులో మహిళలు 13.85 కోట్లు
చురుగ్గా పాల్గొంటున్న 12.16 కోట్ల మందిలో ఆరున్నర కోట్ల మంది మహిళలే
తమిళనాడు, కేరళ, రాజస్తాన్, పంజాబ్‌లో అత్యధికం.. అదే వరుసలో తెలంగాణ
తెలంగాణలో నల్లగొండ, ములుగు, మహబూబాబాద్ జిల్లాలు
దినసరి కూలీలకు ‘ఉపాధే’మేలంటున్న మహిళా కూలీలు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్–నరేగ)లో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 70 శాతం మంది కూలీలు మహిళలే పనిచేస్తున్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో అత్యధికంగా మహిళా కూలీలే పాల్గొంటున్నట్లు.. ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన నివేదికలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ వెల్లడించింది.
భూమి అభివృద్ధి, చెరువుల తవ్వకం వంటి పనుల్లో పురుషులతో సమానంగా కష్టపడుతున్నారు. కుటుంబ పోషణకు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఇంటిని చక్కదిద్దడంలో భాగస్వామ్యం వహిస్తున్నారు. పురుషులతో సమానంగా వ్యవసాయం, భూమి అభివృద్ధి, చెరువు కాలువల తవ్వకం, ఫిష్‌పాండ్ తవ్వకాలు వంటి మట్టి పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. – సాక్షి ప్రతినిధి, వరంగల్
దేశ వ్యాప్తంగా ‘ఉపాధి’లెక్క ఇదీ.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో 741 జిల్లాలు.. 2,69,228 గ్రామ పంచాయతీల్లో ఉపాధి పథకం అమలవుతోంది. ఇందుకోసం 27.64 కోట్ల మంది ఉపాధి పనుల్లో పాల్గొనేందుకు జాబ్‌కార్డులు పొందారు. ఇందులో 12,16,19,422 మంది కూలీలు మాత్రమే పనుల్లో చురుగ్గా పాలొంటున్నారు. వీరి కోసం 2025–26 సంవత్సరానికి 9.29 కోట్ల పనులను గుర్తించి 122.91 కోట్ల పని దినాలను కూలీలకు కల్పించారు.
ఇందువల్ల ప్రత్యక్షంగా సుమారు 4.12 కోట్ల కుటుంబాలకు ‘ఉపాధి’కలిగినట్లు కేంద్రప్రభుత్వ నివేదిక వెల్లడించింది. ఉపాధి కూలీలు నమోదు చేసుకున్న 27,64,35,398 మందిలో మహిళా కూలీల సంఖ్య 13,85,16,125 (50.10 శాతం కాగా, చురుగ్గా పాల్గొన్న 12,16,19,422 మందిలో 6,50,33,150 (53.47 శాతం) మంది మహిళలు కావడం గమనార్హం.
అత్యధికంగా ఆరు రాష్ట్రాలలో... అదే వరుసలో తెలంగాణ
34 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో ఉపాధి కూలీలు మహిళల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ.. తెలంగాణతో పాటు మరో ఆరు రాష్ట్రాల్లో 56 నుంచి 80 శాతానికి పైగా ఉన్నారు. తమిళనాడులో ఉపాధి పనుల్లో చురుగ్గా పాల్గొంటున్న కూలీల సంఖ్య 88.71 లక్షలుగా ఉండగా.. అందులో మహిళా కూలీలు 71.84 లక్షలు (80.98 శాతం)గా ఉన్నారు.
కేరళలో 22.85 లక్షలకు మహిళలు 18.12 లక్షలు (79.89 శాతం)గా, రాజస్తాన్‌లో 116.29 లక్షలకు 70.20 (62.89 శాతం), పంజాబ్‌లో 15.99 లక్షలకు 9.26 లక్షలు (57.91 శాతం), తెలంగాణలో 55.90 లక్షల మంది కూలీలకు మహిళలు 31.33 లక్షలు (56.40 శాతం)గా ఉన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 96.51 లక్షలకు 52.47 లక్షలు (54.37 శాతం)గా, కర్ణాటకలో 75.52 లక్షలకు 38.67 లక్షలు (51.20 శాతం)గా.. ఇలా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో మహిళా కూలీలదే ఉపాధి పనుల్లో ఆధిక్యంగా ఉంది.
కాగా తెలంగాణలో మొత్తం కూలీలు 1.04 కోట్లు ఉండగా.. చురుగ్గా పనుల్లో పాల్గొనే 55,89,867 మంది కూలీలలో 31,32,674 మంది మహిళలు ఉన్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో మహిళలే అధికంగా పాల్గొంటుండగా, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్ తదితర జిల్లాల్లో అత్యధికంగా ఉన్నారు.
‘ఉపాధి’ని వీడని సవాళ్లు..
ఉపాధి హామీ పథకం కింద రూ.307ల దినసరి వేతనంగా ఇస్తున్నా.. అనేక ప్రాంతాల్లో కూలీలకు వేతనాలు ఆలస్యంగా అందుతున్నాయి. ఇది ఉపాధి కూలీల ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తోంది. వేసవిలో పని ప్రదేశాల్లో తగిన సౌకర్యాలు కల్పించకపోవడం, వేతనాలు తక్కువగా ఉండటం వంటి సమస్యలు ఉన్నాయి. కొన్నిచోట్ల క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేయడం, మస్టర్ల మాయాజాలం చేయడం వంటి అవినీతిపై.. కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహిళలను స్వయం ఉపాధి వైపు మళ్లించేలా, ఆవులు, మేకల పెంపకం వంటి వ్యక్తిగత ప్రయోజనాలు పొందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. పని ప్రదేశాలలో సకల సౌకర్యాలను కల్పించాలని, వేడి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పనులను ఉదయం, సాయంత్రం వేళల్లోనే కల్పించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసినా.. వేతనాలు ఆలస్యం అవ్వడం, పనులకు వెళ్లేటప్పుడు సౌకర్యాలు లేకపోవడం, సిబ్బంది అవినీతి వంటి సమస్యలు వారిని వేధిస్తున్నాయని చెబుతున్నారు.
ఉపాధితో ఎంతో మేలు అయితంది
ఉపాధి హామీ పనులు గ్రామాల్లో నిర్వహించడం వల్ల మాలాంటి నిరుపేద కూలీలకు ఎంతగానో మేలు జరుగుతోంది. వ్యవసాయ పనులు లేని సమయంలో.. ఉపాధి హామీ కూలి పనులకు క్రమం తప్పకుండా వెళ్తాం. ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చిన కొలతల ప్రకారం పనిచేస్తే పెంచిన కూలి రేటు రూ.307 వస్తుంది. బయట కూలి పనికి వెళ్లినా కూలి రూ.300లే ఇస్తున్నారు. దీంతో ఉపాధి హామీ పనికి వెళ్లడమే మేలనిపిస్తోంది. పని జరుగుతున్న ప్రదేశంలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇంకా బాగుంటుంది. – కుంట రజిత, మల్లికుదుర్ల గ్రామం, హనుమకొండ జిల్లా
దేశవ్యాప్తంగా ‘ఉపాధి’జిల్లాలు: 741
గ్రామ పంచాయతీల సంఖ్య: 2,69,228
‘ఉపాధి ’కోసం నమోదు చేసుకున్న కూలీలు: 27,64,35,398
వీరిలో మహిళల సంఖ్య: 13,85,16,125 (50.10 శాతం)
ఉపాధి పనుల్లో చురుగ్గా పాల్గొంటున్న కూలీలు: 12,16,19,422
ఉపాధి పనుల్లో పొల్గొనే మహిళా కూలీలు: 6,50,33,150
ఉపాధి పనుల్లో పాల్గొనే మహిళా కూలీల శాతం 53.47శాతం
‘ఉపాధి’లో లబ్ధి పొందుతున్న కుటుంబాలు: 4.13 కోట్లు
2025–26 కోసం గుర్తించిన పనులు మొత్తం: 9.29 కోట్లు
కల్పించిన పని దినాలు (02.09.2025 వరకు): 122,91,09,626