‘భారత్‌లో బద్ధకస్తులు ఎక్కువయ్యారు..’ ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన.. రూ. 25,600 కోట్ల భారం

WHO report on physical activity in Indian people - Sakshi

శారీరక శ్రమ లేక దీర్ఘకాలిక జబ్బులకు అయ్యే ఖర్చు ఇది 

దేశంలో శారీరక శ్రమపై డబ్ల్యూహెచ్‌వో నివేదిక

66% మరణాలు దీర్ఘకాలిక వ్యాధులవే

మరణాల్లో 30 శాతం గుండెజబ్బుల వల్లేనని స్పష్టీకరణ  

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో బద్ధకస్తులు ఎక్కువయ్యారు. చాలామంది శారీరక శ్రమ చేయడం లేదు. ఫలితంగా దీర్ఘకాలికవ్యాధులు పెరుగుతున్నాయి. ఈ జబ్బులకు చికిత్స ఖర్చు భారీగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ‘శారీరక శ్రమ లేకపోవడం వల్ల తలెత్తుతున్న అనారోగ్య సమస్యలు, పడుతున్న భారం’పై ఆ సంస్థ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. అందులో భారత్‌ గురించి అనేక అంశాలను ప్రస్తావించింది. మనదేశంలో 11–17 మధ్య వయస్సువారిలో 74 శాతం మంది శారీరక శ్రమ చేయడంలేదు.

అందులో బాలురు 72 శాతం, బాలికలు 76 శాతం ఉన్నారు. 18 ఏళ్లు పైబడినవారిలో మహిళలు 44 శాతం, పురుషులు 25 శాతం వ్యాయామం చేయడంలేదు. 70 ఏళ్లు పైబడినవారిలో మహిళలు 60 శాతం, పురుషులు 38 శాతం శారీరక శ్రమ చేయడం లేదు. శారీరక శ్రమ చేయకపోవడం వల్ల దీర్ఘకాలిక జబ్బులైన బీపీ, షుగర్, పక్షవాతం, గుండె, క్యాన్సర్, మానసిక రుగ్మతలు తలెత్తుతు న్నాయి. వీటిని నయం చేసేందుకు అయ్యే ఖర్చు దేశంలో ఏడాదికి రూ. 25,600 కోట్ల ఖర్చు అవుతోంది. వచ్చే పదేళ్లలో అది ఏకంగా రూ.2.5 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా.  

వాకింగ్, సైక్లింగ్‌పై జాతీయ విధానం కరువు 
దేశంలో చనిపోయేవారిలో 66% మంది దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులే. మొత్తం మరణాల్లో 30 శాతం గుండెకు సంబంధించినవే కావడం గమనార్హం. ఆ తర్వాత ఊపిరితిత్తి వ్యాధులు, క్యాన్సర్, షుగర్, ఇతరాలతో చనిపోతున్నారు. పాఠశాలల్లో నాణ్యమైన శారీరక శ్రమ ఉండటంలేదు. జాతీయంగా శారీరక వ్యాయామం చేయించడానికి పెద్ద వాళ్ల విషయంలో ఒక సర్వేలెన్స్‌ వ్యవస్థ ఉంది. కానీ, చిన్నపిల్లలకు లేదు. ఐదేళ్ల లోపు పిల్లల విషయంలో శారీరక శ్రమ ఎంత చేయాలన్న దానిపై మార్గదర్శకాలే లేవు.  
 
సాధారణ సిఫార్సులు... 
► 2050 నాటికి శారీరక శ్రమ లేకపోవడం అనే స్థితిని 15 శాతానికి తగ్గించాలి.  
► ప్రపంచంలో వచ్చే పదేళ్లలో సరైన శారీరక శ్రమ చేయకపోవడం వల్ల కొత్తగా 50 కోట్లమంది దీర్ఘకాలికవ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే పదేళల్లో నమోదయ్యే బీపీ కేసుల్లో 47 శాతం వ్యాయామం లేకపోవడం వల్లే సంభవించవచ్చు. మానసిక రుగ్మతలు నమోదయ్యే కేసుల్లో 43 శాతం మేర వ్యాయామం లేకపోవడం కారణమే. 50 కోట్ల కొత్త కేసుల్లో మూడో వంతు కేసులు దిగువ మధ్య ఆదాయ దేశాల్లోనే ఉంటాయి. అంటే మనలాంటి దేశాల్లోనే ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. 
► నడకకు అనువైన రహదారుల వ్యవస్థను నెలకొల్పాలి.  
► వాహనాల వేగంపై నియంత్రణ ఉండాలి.  
► డ్రంక్‌ అండ్‌ డ్రైవ్, మొబైల్‌ మాట్లాడుతూ నడపడంపై నియంత్రణ ఉండాలి.  
► శారీరక శ్రమ చేయాలని ప్రోత్సహించే వ్యవస్థ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండాలి.  
► ప్రతి ఒక్కరికీ వారానికి 300 నిముషాల వ్యాయామం తప్పనిసరి 
► 18 ఏళ్లు పైబడినవారు వారానికి 150 నుంచి 300 మధ్యస్థ శారీరక శ్రమ చేయాలి.  
► 11–17 మధ్య వయస్సున్న పిల్లలు రోజుకు గంట శారీరక శ్రమ చేయాలి.  
► 18 ఏళ్లు పైబడినవారు కనీసం వారానికి రెండుసార్లు కండరాలు బలపడే వ్యాయామాలు చేయాలి.  
► 50 ఏళ్లు పైబడినవారు వారానికి మూడు సార్లు బ్యాలెన్స్‌ ఎక్సర్‌ సైజ్‌లు చేయాలి.  
  
మానసిక రుగ్మతలపైనే ఖర్చు ఎక్కువ: డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ 
వ్యాయామం లేకపోవడం వల్ల ప్రధానంగా బీపీ, డిప్రెషన్, మతిమరుపు సమస్యలు వస్తాయి. ప్రపంచంలో 75 శాతం మరణాలకు దీర్ఘాకాలిక జబ్బులే కారణం. ఈ జబ్బులకు శారీరక శ్రమ లేకపోవడమే ప్రధాన కారణం. అయితే వీటిని తగ్గించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య బడ్జెట్లో కేవలం రెండు శాతమే ఖర్చు చేస్తున్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top