మరో మహమ్మారిని ఎదుర్కొనేలా... | Pandemic Treaty was signed on April 16th | Sakshi
Sakshi News home page

మరో మహమ్మారిని ఎదుర్కొనేలా...

Published Sat, May 3 2025 3:33 AM | Last Updated on Sat, May 3 2025 3:33 AM

Pandemic Treaty was signed on April 16th

కోవిడ్‌ వంటి మహమ్మారిని మరింత సమ ర్థంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నేతృత్వంలో ఏప్రిల్‌ 16న ఈ మేరకు ‘ద పాండెమిక్‌ ట్రీటీ’ ఒప్పందం కుదిరింది. డబ్ల్యూహెచ్‌ఓ నేతృత్వంలో కుదిరిన రెండో అంతర్జాతీయ ప్రజారోగ్య ఒప్పందం ఇది. 2003లో ‘ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్  టొబాకో కంట్రోల్‌’ చర్చల్లో నేను భారత్‌కు ప్రాతినిధ్యం వహించాను. పొగాకు నియంత్రణకు సంబంధించిన ఈ ఒప్పందాన్ని అమెరికా, జపాన్ , అర్జెంటీనా వ్యతిరే కించినా,  యూరోపియన్  యూనియన్  తటపటాయించినా చివరకు వాణిజ్య ప్రయోజనాల కంటే ప్రజారోగ్యమే ముఖ్యమని గుర్తించారు. 

‘ద పాండెమిక్‌ ట్రీటీ’ విషయంలోనూ వాణిజ్య ప్రయోజనాలు కొందరి ప్రాధాన్యంగా ఉండింది. ఫలితంగా ఈ ఒప్పందంపై నాలు గేళ్లుగా చర్చలు, వాద ప్రతివాదాలూ నడిచాయి. కోవిడ్‌ వంటి మహ మ్మారి విషయంలో ఎదురైన వైఫల్యాలను మాత్రం ప్రపంచ దేశా లన్నీ గుర్తించాయి. విపత్కర పరిస్థితుల్లో దేశాల మధ్య మరింత సమ న్వయం, సహకారం అవసరమనీ, వట్టిమాటలు, సంఘీభావాలతో ప్రయోజనం తక్కువేననీ అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా ఒక ఒప్పందం అవసరాన్ని కూడా గుర్తించాయి. వాస్తవానికి ఈఒప్పందం గత ఏడాదే అమల్లోకి రావాల్సింది. ఒప్పంద ప్రతిలోని భాష విషయంలో కొన్ని దేశాలు విభేదించడంతో ఈ ఏడాదికి పొడిగించాల్చి వచ్చింది. 

ధనిక దేశాల మొండిపట్టు
‘ద పాండెమిక్‌ ట్రీటీ’ ఏడాది క్రితమే కుదరకపోవడానికి రెండు ప్రధానమైన అంశాలు కారణం. ప్రపంచం మొత్తానికి టీకాలు,మందులు, టెక్నాలజీలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండేలా హామీ పొందడం ఒకటైతే... ప్రమాదకరమైన సూక్ష్మజీవులను మొట్టమొదట గుర్తించిన దేశం దాన్ని ఇతర దేశాలతో పంచుకోవడం (టీకా, మందులపై ప్రయోగాలు, నిర్ధారణ పరీక్షల అభివృద్ధి వంటి వాటికోసం) రెండో విషయం. ధనిక దేశాలు తమ ఫార్మా కంపెనీల ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఈ విషయాలపై పేటెంట్‌ హక్కులను రక్షించుకునే ప్రయత్నం చేశాయి. 

అదే సమయంలో తమకు టీకాలు, మందులు, టెక్నాలజీలు అందుబాటు ధరల్లోఉండేలా చూడాలని పేద, మధ్యస్థాయి దేశాలు పట్టుబట్టాయి. హాని కారక సూక్ష్మజీవులను ఇతర దేశాలతో పంచుకుంటున్నందుకు, క్లినికల్‌ ట్రయల్స్‌ ద్వారా తమ జనాభాల్లో టీకా, మందులను ప్రయో గించి చూస్తున్నందుకు తమకు ఈ వెసలుబాటు కల్పించాలని కోరాయి. ఈ వైరుధ్యం కారణంగా చర్చలు దీర్ఘకాలం కొనసాగాయి. 

ఒప్పందంలోని పదాలను కూడా అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో మార్చాల్సి వచ్చింది. చివరకు ఈ 2 వివాదాస్పద అంశాలను కాన్ఫరెన్స్  ఆఫ్‌ పార్టీస్‌ సమావేశాల్లో చర్చలు కొనసాగించాలని నిర్ణ యించారు. వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ సమావేశాల్లో ఈ ట్రీటీని ప్రవేశ పెట్టిన తరువాత ఇది అమల్లోకి వస్తుంది. ఫార్మా కంపెనీల ప్రయోజనాలను కాపాడేందుకు ధనిక దేశాలు ఎంత మూర్ఖంగా బేరాలాడాయి అంటే... సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకునే విషయంలో ‘పరస్పర అంగీకారం ఆధారంగా’ అన్న వాక్యాన్ని ‘స్వచ్ఛంద పరస్పర అంగీకారం’ అని మార్చేంత వరకూ ఒప్పుకోలేదు. 

సానుకూలతలు
కోవిడ్‌ సమయంలో ధనిక దేశాలు టీకాలను నిల్వ చేసుకున్న దాఖలాలు ఇంకా తాజాగానే ఉన్నాయి. టీకాలు అందుబాటులో లేని చోట్ల కోవిడ్‌ వైరస్‌ వేగంగా రూపాంతరం చెందిన విషయమూ తెలిసిందే. ఒక్క విషయమైతే స్పష్టం. ద పాండెమిక్‌ ట్రీటీ విషయంలో ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా 193 దేశాలు కొన్ని కీలకఅంశాల విషయంలోనైతే ఏకాభిప్రాయానికి వచ్చాయి. కోవిడ్‌ వంటి మహమ్మారులు ప్రబలుతున్న సమయంలో సమాచారాన్ని వేగంగా, తగిన సమయంలో పంచుకోవాలన్నది వీటిల్లో ఒకటి. 

అలాగే టీకాలు, మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షల తయారీదారులు తమ ఉత్పత్తిలో కనీసం 20 శాతాన్ని అందుబాటు ధరల్లో డబ్ల్యూహెచ్‌ఓకు అందించాలన్నది రెండోది. వ్యాధిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం మూడోది. మాస్కులు, పీపీఐ కిట్ల వంటి వాటి సరఫరా, లభ్యతల విషయంలో డబ్ల్యూహెచ్‌ఓకు పర్యవేక్షణ అధికారం దక్కడం ఒక విశేషం.

ఈ ఒప్పందం కోవిడ్‌ లాంటి మహమ్మారుల నివారణపై కూడా దృష్టి పెడుతోంది. వన్  హెల్త్‌ పద్ధతిని అనుసరించాలని సూచిస్తోంది. భౌగోళికంగా వేర్వేరు ప్రాంతాల్లో పరిశోధనలు చేపట్టాలనీ, ప్రమాద కర సూక్ష్మజీవులు పరిశోధనలకు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలనీ, మందులు, ఇతర ఆరోగ్య సంబంధిత ఉత్పత్తుల తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాలనీ కూడా ఈ ఒప్పందం ప్రస్తావిస్తోంది. 

అంతేకాకుండా... అంతర్జాతీయ స్థాయిలో వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులను అరోగ్య అత్యవసర పరిస్థితులకు దీటుగా స్పందించేలా సిద్ధం చేయాలని, ఈ కార్యకలా పాలకు అవసరమైన ఆర్థిక వనరుల సమన్వయానికి, ఆరోగ్య వ్యవస్థ లను బలోపేతం చేసేందుకూ, అంతర్జాతీయంగా సప్లై చెయిన్, లాజి స్టిక్స్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.

ప్రజారోగ్యం విషయంలో దేశాలకు ఉన్న సార్వభౌమ అధికారా లను గుర్తించే ఈ ఒప్పందం, అందులోని అంశాలు ఏ రకంగానూ డబ్ల్యూహెచ్‌ఓ ఇస్తున్న ఆదేశాలుగా భావించరాదని స్పష్టం చేస్తోంది. దేశీ విధానాలు, కార్యక్రమాలను మార్చుకోవాల్సిన అవసరమూ లేదని తెలిపింది. అంటే ప్రయాణీకుల నిలిపివేత, టీకాలు తప్పనిసరి చేయడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టడం వంటివి.

నిపుణుల ఆమోదం...
ఈ ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదరడంపై అంతర్జాతీయ నిపుణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్య చట్టాల విషయంలో నిపుణుడైన అమెరికా న్యాయవాది లారెన్స్ గోస్టిన్‌దృష్టిలో ఈ ఒప్పందం ఒక ఘన విజయం. ఈ ఒప్పందంపై విమర్శకులు కూడా లేకపోలేదు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ఉండగా... రిపబ్లికన్  పార్టీ నేతలు, ఒక వర్గం మీడియా వ్యాఖ్యాతలు అమెరికా ఈ చర్చల్లో పాల్గొనడాన్నే తప్పుపట్టారు. 

డబ్ల్యూహెచ్‌ఓ అమెరికా సార్వభౌమత్వంలో జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ ముసాయిదా ఒప్పందాన్ని తిరస్కరించారు. వాణిజ్యం, పర్యాటకరంగాలపై దీని ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ ప్రభుత్వంగా మారే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత డబ్ల్యూహెచ్‌ఓ నుంచిట్రంప్‌ వైదొలగడంతో ఈ ఒప్పందంపై చర్చలు వేగవంత మయ్యాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సాగాయని కూడా చెప్పాలి. 

ఇక్కడ ఒక కీలకమైన విషయం గురించి చెప్పుకోవాలి. ఒప్పందాన్ని ఆమోదించిన దేశాల జాబితాలో అమెరికా లేకపోవడం హానికారక సూక్ష్మజీవులపై ప్రపంచవ్యాప్త నిఘా అన్న అంశాన్ని బలహీన పరిచేదే. సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి కూడా ఎంతవరకూ సాధ్యమవుతుందన్నది చూడాలి. కాబట్టి ఆ యా దేశాల స్థాయిలో వనరుల నిర్మాణం, ప్రాంతీయ స్థాయిలో సహకారం వంటి ఇతర మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి సవాళ్లకు అంతే స్థాయి స్పందన కూడా అవసరమవుతుంది. పాండె మిక్‌ ట్రీటీ ఈ దిశగా వెళ్లేందుకు తగిన చోదక శక్తిని ఇస్తోంది!

-వ్యాసకర్త ‘పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా’,‘ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ’ డిస్టింగ్విష్డ్‌ ప్రొఫెసర్‌
(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)
- కె. శ్రీనాథ్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement