
తెలంగాణ ఓవర్‌సీస్ మ్యాన్‌పవర్ పథకం కింద శిక్షణ పొందిన 18 మంది ఎలక్ట్రీషియన్లు జర్మనీలో ఉద్యోగానికి ఎంపికయ్యారని కార్మిక, ఉపాధికల్పన శాఖా మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంగళవారం సచివాలయంలో జర్మనీలో ఉద్యోగం చేయడానికి ఎంపికైన 18 మంది ఎలక్ట్రీషియన్లకు ఆయన ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇండో యూరో సింక్రనైజేషన్(ఐఈఎస్) సంస్థ వీరికి ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చారని ఈ శిక్షణ పూర్తి చేసుకొని అన్ని పరీక్షల్లో నెగ్గిన వీరు జర్మనీలో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇతర దేశాల్లో సైతం మన యువత పనిచేసేలా వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్నదని అన్నారు. వీరు నెలకు రూ. 2.6 లక్షల వేతన ప్యాకేజీని పొందనున్నారని తెలిపారు ఈ పథకం ద్వారా ఇక్కడి వారి కుటుంబాలు ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయని అన్నారు.

త్వరలోనే ఇండో యూరో సింక్రనైజ్ సంస్థ కార్యకలాపాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేస్తామని గ్రామీణ ప్రాంతల్లో యువతకు నైపుణ్య శిక్షణ పెంచేందుకు పలు కార్యక్రమాలు క్యాంపులు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, ఇండో యూరో సింక్రనైజేషన్ సీఈవో డాక్టర్ బంగారు రాజు తదితరులు పాల్గొన్నారు.