పక్కా స్కెచ్‌తో ‘ఏయ్‌ జూనియర్‌’ నిర్మాతను పట్టుకున్న పోలీసులు | Sakshi
Sakshi News home page

పక్కా స్కెచ్‌తో ‘ఏయ్‌ జూనియర్‌’ నిర్మాతను పట్టుకున్న పోలీసులు

Published Thu, Jun 30 2022 9:07 PM

Warangal Task Force Police Arrest Ey Junior Producer - Sakshi

సాక్షి, వరంగల్‌: సినిమా నడవాలంటే కథా బలంతోపాటు క్లైమాక్స్‌ మరీ ముఖ్యం. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా భారీ సెట్టింగులు వేసి ప్లాన్‌ చేస్తారు.  సేమ్‌ టు సేమ్‌.. అదే తరహాలో రైల్వే, ఎఫ్‌సీఐలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన డబ్బుతో ‘ఏయ్‌ జూనియర్‌’ సినిమా నిర్మించిన ఎస్‌కే. గౌస్‌ను పట్టుకునేందుకు వరంగల్‌ పోలీసులు సినిమా చూపించారు. ముఠాను గత సోమవారం వరంగల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముఠా మోసాలు, అరెస్ట్‌ తతంగమంతా ఓ సినిమాలా సాగింది. 

రూ.4కోట్ల వరకు సమర్పణ
ఉమ్మడి వరంగల్‌ నుంచి దాదాపు 15 మంది రూ.4కోట్ల వరకు సమర్పించారు. ఇలా వచ్చిన డబ్బులను రెట్టింపు చేయడంతోపాటు తన సినిమా కోరిక నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ వైపు అడుగులు వేశాడు. ఈ డబ్బుతో 2018లో ‘ఏయ్‌ జూనియర్‌’ సినిమాను మొదలెట్టాడు. ఇలా సినిమా 2020లో షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల వద్ద ఆగిపోయింది. అంతలోనే కరోనా రావడంతో పోస్ట్‌ ప్రొడక్షన్‌కు అయ్యే వ్యయం రూ.30లక్షలు చేతిలో లేకపోవడంతో నిలిచిపోయింది. 

‘సినిమా’ చూపించి.. మోసం
గుంటూరు జిల్లా పట్టాభిరామ్‌కు చెందిన ఎస్‌కే. గౌస్‌కు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి.  కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అది నెరవేరడం కష్టమనుకున్నాడు. అదే సమయం(2017)లో సెక్రటేరియట్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న వరంగల్‌కు చెందిన ఎర్రబెల్లి సతీశ్‌తో  పరిచయం ఏర్పడింది. ఖద్దర్‌ డ్రెస్‌లో  వచ్చిన గౌస్‌ను చూసి మీరు ఏమి చేస్తారు సర్‌.. అంటే ఉన్నతస్థాయి రాజకీయ నేతలు, అధికారులతో పరిచయాలు ఉన్నాయని, ఎక్కడంటే అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెబుతాడు. దీంతో సతీశ్‌ తన అల్లుడు రాజేశ్‌ తరఫున రూ.7లక్షలు ఇవ్వడంతో శిక్షణ కోసం కోల్‌కతా తీసుకెళతాడు.

రెండు నెలలపాటు రూ.10 వేల జీతం ఇచ్చి అక్కడినుంచి బిహార్‌ బదిలీ అయ్యావని నమ్మిస్తాడు. అక్కడికెళితే నార్త్‌ ఇండియా అంటూ దాడులు చేస్తారని బెదిరించడంతో మూడు నెలలు మాత్రమే ఉద్యోగం చేస్తాడు.  ఇలా.. సతీశ్‌ మరి కొందరిని కూడా గౌస్‌ వద్దకు పంపుతాడు. అతడు పశ్చిమ బెంగాల్‌లోని క్రిష్‌ వద్దకు పంపించి.. పరీక్షలు, మెడికల్‌ టెస్టులు చేసి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇప్పిస్తాడు. అక్కడ 2 నెలల శిక్షణ ముగియగానే సౌత్‌ ఇండియా వాళ్లని, ఇక్కడివారు దాడులు చేస్తారంటూ భయపడేలా చేసి పంపిస్తారు. ఇలా సినిమా చూపించి నిరుద్యోగులను మోసం చేశాడు. 

నిందితుడికి సినిమా చూపించి అరెస్ట్‌..
మోసపోయిన నిరుద్యోగులు వరంగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగితే ‘ఏయ్‌ జూనియర్‌’ నిర్మాత ఎస్‌కే.గౌస్‌ నిందితుడిగా తేలాడు. అతన్ని పట్టుకునేందుకు స్కెచ్‌ వేశారు. సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌కు అయ్యే రూ.30లక్షలు లేని నిర్మాత గౌస్‌కు పెట్టుబడి పెడతామంటూ మఫ్టీలో ఉన్న మన పోలీసులు ఆశ చూపారు. మాటల్లో దింపి  ఢిల్లీ నుంచి వరంగల్‌కు రప్పించారు. వరంగల్‌ శివనగర్‌లోని ఓ హోటల్‌లో చర్చలు జరిపారు. రూ.30లక్షలిస్తే రూ.3కోట్లు వస్తాయా.. అంటూ మాటల్లోకి దింపారు. డైరెక్టర్‌ రూ.30లక్షలకు అదనంగా మరో రూ.20లక్షలు మాత్రమే వస్తాయని సమాధానమిచ్చాడు.

అప్పటికే ఓటీటీకి మూవీ విక్రయించామని చెప్పిన డైరెక్టర్‌ అక్కడినుంచి పోలీ సుల కనుసైగతో వెళ్లిపోయాడు. దీంతో అక్కడే ఉన్న గౌస్‌తోపాటు నిరుద్యోగులను వంచించిన కేసులో నిందితులుగా ఉండి.. అక్కడికొచ్చిన కోల్‌కతా కు చెందిన క్రిష్, వరంగల్‌ పాపయ్యపేటకు చెందిన ఎర్రబెల్లి సతీశ్‌లకు సంకెళ్లు వేసేందుకు యత్నించారు. పారిపోయేందుకు వీరు ప్రయత్నిస్తున్న సందర్భంలో సినిమాలో మాదిరిగానే వీరి వెంటబడి పట్టుకున్నారు. చేతులకు సంకెళ్లు వేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement