పాతబస్తీలో బరువెక్కిన హృదయాలతో పరామర్శలు
ఏ బస్తీలో చూసినా విషాదఛాయలే... తమ వారిని తలచుకుంటూ కన్నీరుమున్నీరు అవుతున్నారు. బంధువులు, స్నేహితులపరామర్శలు, మృతులతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఉమ్రా యాత్ర కు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.
దేవుడు తనవద్దే ఉంచుకున్నాడు: మహ్మద్ రజాక్
విజయనగర్‌కాలనీ: ఆసిఫ్‌నగర్ న్యూకిషన్‌నగర్‌లో ఉంటున్న మహ్మద్ రజాక్ తన కుటుంబ సభ్యులను తలచుకొని చెప్పలేని బాధతో దుఃఖిస్తున్నాడు. ఫర్నచర్ పనిచేసే కుమారుడు మహ్మద్ మంజూర్ చనిపోవడంతో కుటుంబానికి ఆర్థికంగా ఆదుకునే పెద్ద దిక్కును కోల్పోయానని విలపించాడు.
భార్య షౌకత్‌బేగం, కోడలు ఫర్హీన్‌బేగం, మనవరాలు జాహీన్‌బేగం మరణాన్ని కూడా తట్టుకోలేకపోతున్నాడు. ‘దైవ దర్శనానికి అని వెళితే..ఆ దేవుడు తిరిగి ఇంటికి పంపకుండా తన వద్దకే రప్పించుకున్నాడు’అని మహ్మద్ రజాక్ చెప్పాడు.
మాకు దిక్కెవరు ?
జిర్రా నటరాజ్‌నగర్‌లోని పక్కపక్క ఇళ్లల్లో నివసించే ఐదుగురి మృతితో అక్కడ రోదనలు మిన్నంటాయి. హోటల్ వ్యాపారం నిర్వహించి కుటుంబాన్ని పోషిస్తున్న మహ్మద్ అలీ, అతని భార్య షాయినాజ్ బేగం మృతి చెందడంతో వారి పెద్ద కూతురు సమ్రీన్‌బేగం, రెండో కూతురు సానియాబేగం, మూడో కూతురు నూర్‌అప్సాబేగం, పెద్ద కుమారుడు సోహెబ్‌అలీ, చిన్న కుమారుడు మహ్మద్ ఆమేజ్‌లు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
వృద్ధాప్యంలో తనకు కొడుకు, కోడలు ఆసరాగా ఉంటా రని అనుకుంటే, దేవుడు వారిని తీసుకెళ్లారంటూ ఏడుస్తోంది. గోషామహల్ ఫీల్‌ఖాన్‌లో తన తండ్రి హోటల్ నడిపేవాడని, అక్కడకు వెళ్లి సహాయపడేవాడినని గుర్తు చేసుకున్నాడు.
చివరిచూపు కోసం...
చార్మినార్: వట్టేపల్లి, మిశ్రీగంజ్‌లోని రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులు చివరిచూపు కోసం ఎదురుచూస్తున్నారు. బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్ మోబిన్‌తోపాటు మజ్లిస్ పార్టీ కార్పొరేటర్లు మంగళవారం బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. మక్కా పవిత్ర స్థలం కావడంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తే బాగుంటుందని మృతుల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఎమ్మెల్యేకు సూచించారు.
తాము రెండు రోజులుగా హజ్ హౌస్‌తోపాటు ఇతర కార్యాలయాలకు వెళ్లి వస్తున్నామని పనులు వేగంగా జరగడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
» మిశ్రీగంజ్ ప్రాంతానికి చెందిన తల్లీకొడుకు సారాబేగం, సలీంఖాన్, మృతి చెందిన విషయం తెలిసిందే. సలీంఖాన్ భార్య తన ఇద్దరు కొడుకులతో కలిసి సోదరుడైన అమీర్‌ఖాన్ వద్ద ఉండిపోయింది.
» వట్టేపల్లి ఫాతిమానగర్‌కు చెందిన మహ్మద్ మస్తాన్‌తోపాటు భార్య జకియాబేగం, కుమారుడు మహ్మద్ సోహెల్ మృతి చెందగా, వారి కూతురు అత్తగారింట్లో ఉండగా..పెద్ద కుమారుడు మహ్మద్ గౌస్ అమెరికాలో ఉన్నాడు. మా కుటుంబ సభ్యులను చివరిసారి చూసేందుకు వెంటనే సౌదీకి పంపించే ఏర్పాట్లు చేయాలని మృతుడు మహ్మద్ మస్తాన్ అల్లుడు మహ్మద్ అబ్దుల్ కోరారు.


