
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మేడిగడ్డ నుంచి నీళ్లు తరలించాలని బీఆర్‌ఎస్ నేతలు పదేపదే అంటున్నారు
కానీ కాళేశ్వరం కట్టడాలు ప్రమాదకరంగా ఉన్నట్టు ఎన్డీఎస్‌ఏ తేల్చిం ది
వాటిలో నీళ్లు నింపితే కూలిపోయే ప్రమాదం ఉంది... 44 గ్రామాలు,సమ్మక్క బరాజ్ కొట్టుకుపోతాయి
సాక్షి, హైదరాబాద్: ‘మేడిగడ్డ బరాజ్ నుంచి నీళ్లను ఎందుకు ఎత్తిపోయడం లేదని బీఆర్‌ఎస్ నేతలు పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల డిజైన్లు, నిర్మాణం, నిర్వహణలో లోపాలున్నట్టు ఎన్డీఎస్‌ఏ తేల్చిం ది. ఆ కట్టడాలు ఇంకా ప్రమాదకరంగానే ఉన్నాయని, వాటిలో నీళ్లను నింపవద్దని సూచించింది. బరాజ్‌లలో నీళ్లు నింపితే అవి కూలిపోయి దిగువన ఉన్న 44 గ్రామాలతో పాటు సమ్మక్క సారక్క బరాజ్ కొట్టుకుపోతాయ్.
భద్రాచలం ఆలయం, పట్టణం ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. బరాజ్‌లు కూలితే ఎవరు బాధ్యులు?’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఏపీ కృష్ణా జలాల అక్రమ తరలింపు, తప్పుడు నిర్ణయంతో తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణం అనే అంశాలపై బుధవారం ప్రజాభవన్‌లో ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మాట్లాడారు.
కమీషన్ల కక్కుర్తితో కాళేశ్వరం
‘రూ.38 వేల కోట్ల అంచనాలతో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది. నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పడం వల్లే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్‌ను తరలించినట్టు బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వాదనలో నిజం లేదు. నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పలేదు.
ప్రాణహిత కింద 16.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. అదనంగా 2 లక్షల ఎకరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి వ్యయాన్ని నాలుగింతలు పెంచారు. ఐదేళ్లలో మేడిగడ్డ నుంచి 165 టీఎంసీలను గత ప్రభుత్వం తరలించింది. ఏడాదికి సగటున 13 టీఎంసీలతో కొత్తగా 1.4 లక్షల ఎకరాలకే సాగునీరు అందించింది..’అని ఉత్తమ్ చెప్పారు.
బీఆర్‌ఎస్ పాలనలోనే ఏపీ సామర్థ్యం పెరిగింది..
‘ఉమ్మడి రాష్ట్రంతో పోల్చితే బీఆర్‌ఎస్ పాలనలోనే శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి ఏపీ అక్రమ నీటి తరలింపు సామర్థ్యం రోజుకు 47,850 క్యూసెక్కుల (4.1 టీఎంసీలు) నుంచి 1,11,400 క్యూసెక్కుల (9.6 టీఎంసీలు)కు పెరిగింది. 2019 మే, 2020 జనవరి, జూన్‌లో నాటి ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో గోదావరి, కృష్ణా జలాల వినియోగంపై జరిపిన చర్చల ఫలితమే ఇది.
2004– 14 మధ్యకాలంలో ఉమ్మడి ఏపీలో శ్రీశైలం నుంచి ఏపీ బేసిన్ వెలుపలి ప్రాంతాలకు మొత్తం 727 టీఎంసీలను తరలించుకుపోగా, తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్‌ఎస్ పాలనలో 2014–2023 మధ్యకాలంలో ఏకంగా 1,200 టీఎంసీలను తరలించుకుపోవడం నిర్ఘాంతపరిచే అంశం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2024–25లో 286 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించాం.
గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనతో పోల్చితే ఇదే అత్యధికం. బీఆర్‌ఎస్ పాలనలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 44 వేల క్యూసెక్కుల నుంచి 92 వేలకు, మల్యాల లిఫ్టు సామర్థ్యం 3,850 క్యూసెక్కుల నుంచి 6 వేలకు, ముచ్చుమర్రి లిఫ్టు సామర్థ్యం 3,850 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెరిగింది. రాయలసీమకు రోజూ 12,600 క్యూసెక్కుల (1.09 టీఎంసీలు)ను అక్రమంగా తరలించుకునే సామర్థ్యాన్ని ఏపీ పెంచుకుంది..’అని ఉత్తమ్ వివరించారు.
34% నీళ్లు చాలని రాసిచ్చారు..
‘బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు (34 శాతం) సరిపోతాయంటూ, ఏపీకి పదేళ్ల పాటు 512 టీఎంసీలు (66 శాతం) ఇచ్చేందుకు.. 2016 సెప్టెంబర్‌లో జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నాటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌లు అంగీకారం తెలిపారు.
మా ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్.. కృష్ణా జలాల్లో మాకు 71 శాతం వాటా ఇవ్వాలని కోరుతూ కేంద్ర జల సంఘానికి లేఖ రాశారు. పరీవాహక ప్రాంతం, సాగుకు యోగ్యమైన భూమి, కరువును పరిగణనలోకి తీసుకుని తెలంగాణకు 575 టీఎంసీలు (71 శాతం), ఏపీకి 236 టీఎంసీలు(29 శాతం) కేటాయించాలని జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపిస్తున్నాం..’అని మంత్రి తెలిపారు.
నాగార్జున సాగర్ ఆయకట్టుకు ప్రమాదం
శ్రీశైలం జలాశయంలో 797 అడుగుల లోతు నుంచి నీళ్లను తరలించడానికి ఏపీ చేపట్టిన రాయలసీమ లిఫ్టు స్కిమ్‌తో నాగార్జునసాగర్ ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రెండు రాష్ట్రాల సీఎంలతో 2020 ఆగస్టు 5న కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించతలపెట్టగా, ఆ సమావేశాన్ని వాయిదా వేయాలని నాటి సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారన్నారు. అప్పట్లో రాయలసీమ లిఫ్టుకు ఏపీ పిలిచిన టెండర్లకు సహకరించడానికే ఈ కుట్ర చేశారని ఆరోపించారు.