యూరియా... ఏదయా..! | Urea demand increased across the state | Sakshi
Sakshi News home page

యూరియా... ఏదయా..!

Aug 20 2025 5:05 AM | Updated on Aug 20 2025 5:05 AM

Urea demand increased across the state

రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన డిమాండ్‌ 

రోడ్డెక్కుతున్న రైతులు.. భారీ వర్షంలోనూ షాపుల ఎదుట క్యూలు 

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి ప్రతినిధి, వరంగల్‌: రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో..వానాకాలం సీజన్‌ నాట్లు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రాజెక్టులు, చెరువుల కింద నాట్లువేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. వరినాట్లు పడిన 10 నుంచి 15 రోజులకు రైతులు ప్రతి ఎకరాకు ఒక బస్తా నుంచి రెండు బస్తాల చొప్పున యూరియాను వినియోగిస్తారు. ఆ తర్వాత 45 రోజులకు మరోసారి యూరియాను వాడతారు. మరోవైపు పత్తి, మొక్కజొన్న పంటలకు కూడా యూరియా వినియోగం పెరుగుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన యూరియా కోసం డిమాండ్‌ ఎక్కువవుతోంది. 

సరిపడా యూరియా, మిగతా ఎరువులు ఉన్నాయని అధికారులు చెబుతున్నా.. ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్‌ల వద్ద రైతులు బారులు దీరుతున్నారు. యూరియా దొరక్కపోవడంతో రోడ్లపై బైఠాయించి నిరసనలు చేస్తున్నారు. ఆలస్యంగా వరి సాగయ్యే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండగా, ఇప్పటికే మెజారిటీ ప్రాంతాల్లో ఒక విడత యూరియాను వినియోగించిన నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల రైతులు రెండోదఫా యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. 

అయితే గత జూలై నెల నుంచే రైతులకు పొదుపుగా యూరియాను పంపిణీ చేస్తూ వస్తున్న వ్యవసాయ శాఖ దగ్గర ప్రస్తుతం 50 వేల మెట్రిక్‌ టన్నులు కూడా నిల్వ లేదు. ప్రస్తుతం వచి్చన యూరియాను వచ్చినట్లే రేషన్‌ విధానంలో రైతులకు టోకెన్‌లు ఇచ్చి ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేస్తున్నారు. యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా తగ్గడం, మార్క్‌ఫెడ్‌ వద్ద తగినంత నిల్వలు లేకపోవడం, ప్రైవేటు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించడం వంటివి కారణాలనే చర్చ జరుగుతోంది. 

అవసరం 10.48 ఎల్‌ఎంటీ.. కేటాయింపు 9.80 ఎల్‌ఎంటీ 
రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌లో పంటల విస్తీర్ణం 1.32 కోట్ల ఎకరాలుగా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కాగా యూరియా అధికంగా వినియోగించే ప్రధానమైన వరి, పత్తి, మొక్కజొన్న పంటల విస్తీర్ణం భారీగా పెరిగింది. వీటికి తోడు కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వానాకాలం సీజన్‌లో 10.48 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) యూరియా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరితే, గత సీజన్‌లో ఇచ్చిన విధంగానే 9.80 ఎల్‌ఎంటీ మాత్రమే కేటాయింపులు జరిపింది. 

గత యాసంగిలో పంపిణీ చేయగా మిగిలిన 1.92 ఎల్‌ఎంటీల యూరియాను వినియోగించుకోవాలని సూచించింది. కేటాయించిన యూరియాను ఏప్రిల్‌ నెల నుంచి మొదలుపెట్టి ప్రతినెలా రైల్వే రేక్‌ల ద్వారా రాష్ట్రాలకు కేంద్రం పంపిస్తుంది. కానీ తెలంగాణకు ఏప్రిల్‌ నుంచి ఈ ఆగస్టు వరకు ప్రతినెలా పంపే యూరియాలో కోత విధించింది. రాష్ట్రానికి ఇప్పటివరకు 8.30 ఎల్‌ఎంటీల యూరియా రావలసి ఉండగా, కేవలం 5.32 ఎల్‌ఎంటీ యూరియా (2.98 ఎల్‌ఎంటీల లోటు) మాత్రమే పంపింది. 

ఈ యూరియాకు ఓపెనింగ్‌ స్టాక్‌గా ఉన్న మిగులు యూరియా 1.92 ఎల్‌ఎంటీలు కలిపి సుమారు 7.20 ఎల్‌ఎంటీలు రాష్ట్రంలోని సొసైటీలు, మార్క్‌ఫెడ్, ప్రైవేటు డీలర్ల ద్వారా రైతులకు పంపిణీ చేసింది. సెపె్టంబర్‌లో మరో లక్షన్నర మెట్రిక్‌ టన్నుల యూరియా రావలసి ఉండగా, ప్రస్తుతం లోటుగా ఉన్న 2.98 ఎల్‌ఎంటీలను పంపిస్తే తప్ప ఈ నెలలో రైతులకు యూరియా ఇవ్వడం సాధ్యం కాదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు.   

ప్రైవేట్‌ డీలర్ల ద్వారా పారిశ్రామిక అవసరాలకు! 
45 కిలోల యూరియా బస్తాపై కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.1,900 సబ్సిడీ భరిస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో సబ్సిడీ భారాన్ని భరిస్తూ రైతులకు సరఫరా అవుతున్న యూరియా పక్కదారి పడుతోందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 25 శాతం యూరియాను వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నట్లుగా కేంద్రమంత్రి జేపీ నడ్డా చెప్పినట్లు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. రాష్ట్రానికి సరఫరా అయ్యే సబ్సిడీ యూరియాను 50:50 ప్రాతిపదికన ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు ప్రైవేటు డీలర్లు కూడా విక్రయిస్తారు. 

ఉదాహరణకు లక్ష మెట్రిక్‌ టన్నుల యూరియాను కేంద్రం పంపిస్తే అందులో 50 వేల మెట్రిక్‌ టన్నులను ప్రైవేటు డీలర్లకు సరఫరా చేస్తారు. అయితే ప్రైవేటు వ్యాపారుల వద్ద నుంచి యూరియా పక్కదారి పడుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగుల కంపెనీలు, వార్నీష్, ప్లైవుడ్, యాడ్‌–బ్లూ ద్రావణం తయారీ పరిశ్రమల్లో యూరియాను వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. బీరు, గుడుంబా, కోళ్లు, పశువుల దాణా, చేపలు, రొయ్యల చెరువుల్లో సైతం యూరియాను వినియోగిస్తున్నట్లు సమాచారం.  

50 వేల మెట్రిక్‌ టన్నుల సరఫరాకు కేంద్రం హామీ 
రాష్ట్రంలో యూరియా కొరతపై ఢిల్లీలో కాంగ్రెస్‌ ఎంపీలు రెండు రోజులుగా ఆందోళన నిర్వహించారు. మంగళవారం నాటి ఆందోళనకు కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ సంఘీభావం తెలిపారు. కాగా ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్రం.. కర్ణాటక నుంచి 50 వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను తెలంగాణకు పంపించనున్నట్లు తెలిపిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. అయితే ఈ యూరియా రావడానికి మరో 10 రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అయితే 50 వేల మెట్రిక్‌ టన్నులతో రైతుల యూరియా బాధలు ఏమాత్రం తీరవని చెబుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement