ఏ ఏటికాయేడు అయితేనే..! | Unemployee Requests To TSLPRB Fill Any Vacancies Immediately | Sakshi
Sakshi News home page

ఏ ఏటికాయేడు అయితేనే..!

Dec 15 2020 9:21 AM | Updated on Dec 15 2020 9:21 AM

Unemployee Requests To TSLPRB Fill Any Vacancies Immediately - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఖాకీ యూనిఫాం వేసుకోవాలి.. పోలీస్‌ అని పిలిపించుకోవాలి.. అని లక్షలాదిమంది యువతీ  యువకుల కల. ఎప్పుడు నోటిఫికేషన్‌ పడుతుందా..? ఎప్పుడు పోలీస్‌ అవుదామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి స్వప్నం నెరవేర్చేందుకు మూడేళ్ల తర్వాత మరోసారి పోలీస్‌ ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. మరో 20 వేల పోస్టులు భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఇటీవల హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రకటన చేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ కూడా మరో ప్రకటన చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు, ప్రస్తుత పోలీసులు, విశ్రాంత ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ)కు విన్నపాలు చేస్తున్నారు. భవిష్యత్తులో గంపగుత్తగా భారీ స్థాయిలో రిక్రూట్‌మెంట్లు వద్దని, ఎప్పటివి అప్పుడే భర్తీ చేయాలని కోరుతున్నారు. 

3 వేల పోస్టులు సరెండర్‌.. 
రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) 2018లో 18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇందులో 16,925 కానిస్టేబుల్‌ పోస్టులు, 1,503 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు ఉన్నాయి. వాటిలో 9,213 మంది సివిల్, ఏఆర్‌ కానిస్టేబుళ్లు, 1,162 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, దాదాపు 4 వేల టీఎస్‌ఎస్పీ కానిస్టేబుళ్లను కలుపుకొంటే 15 వేల పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలినవి డీజీపీకి సరెండర్‌ చేశారు. కాగా, 2018 మేలో నోటిఫికేషన్‌ రాగానే.. లక్షలాదిమంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్‌లో దరఖాస్తు ప్రక్రియ మొదలుకాగానే.. ఏకంగా 7 లక్షలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కానిస్టేబుల్‌ దరఖాస్తుకు రూ.800 ఫీజు కాగా, ఎస్సైకి రూ.వెయ్యిగా ఉంది. పోలీస్‌ బోర్డుకు ఏకంగా రూ.80 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. 

అర్హత కోల్పోయిన మూడు బ్యాచ్‌లు! 
గతంలో మాదిరిగా ఈసారి గంపగుత్త నోటిఫికేషన్లు వద్దని, ఏటా కొలువుల భర్తీ చేపట్టాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. వయోపరిమితి కారణంగా ఏటా లక్షలాది మంది అర్హత కోల్పోతున్నట్లు వాపోతున్నారు. 2018 నోటిఫికేషన్‌కు త్వరలో రాబోయే నోటిఫికేషన్‌కు మధ్య దాదాపు మూడు బ్యాచ్‌లకు చెందిన వేలాది మంది వయోపరిమితి కారణంగా అనర్హులయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పోలీస్‌ బోర్డు చేపట్టిన నియామకాల్లో 2015లో వయోపరిమితిపై మూడేళ్ల మినహాయింపు ఇచ్చింది. 2018 రిక్రూట్‌మెంట్‌ సమయంలో రెండేళ్ల మినహాయింపు ఇచ్చింది. దీంతో వేలాదిమంది అభ్యర్థులకు ఊరట లభించింది. ఈసారి ఎంతమందికి ఊరట దక్కుతుందోనని అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా, భారీ రిక్రూట్‌మెంట్ల కారణంగా ప్రతీసారి పదోన్నతుల్లో న్యాయపరమైన చిక్కులు తలెత్తడం, అందరికీ పదోన్నతులు కల్పించలేకపోవడం వంటి ఇబ్బందులు వస్తున్నాయి. పైగా వేలాదిమంది ఒకేరోజు జాయిన్‌ అయితే.. ఒకేసారి రిటైర్‌ కావడం వంటి ఇబ్బందులు డిపార్ట్‌మెంట్‌ను భవిష్యత్తులో ఇబ్బంది పెడతాయి. అందుకే ప్రత్యేక కేలండర్‌ రూపొందించుకుని ఏటా రిక్రూట్‌మెంట్లు చేపడితే అభ్యర్థులందరికీ అవకాశం దక్కుతుందని రిటైర్డ్‌ ఉద్యోగులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement