హైదరాబాద్‌ శివార్లలో రెండు కొత్త ఐటీ పార్కులు | Two new IT parks on the outskirts of Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ శివార్లలో రెండు కొత్త ఐటీ పార్కులు

Jan 29 2025 4:44 AM | Updated on Jan 29 2025 4:44 AM

Two new IT parks on the outskirts of Hyderabad

పరిశ్రమలకు భూకేటాయింపులపై ప్రత్యేక పాలసీ

రూ.100 కోట్ల పెట్టుబడిపై‘డ్యూ’ సాఫ్ట్‌వేర్‌ ఆసక్తి

మంత్రి శ్రీధర్‌బాబును కలిసిన డ్యూసాఫ్ట్‌ ప్రతినిధులు  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివార్లలో కొత్తగా రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. హైదరాబాద్‌లో రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన ‘డ్యూ’సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ ప్రతినిధులతో మంగళవారం సచివాలయంలో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 

‘ఐటీ రంగంలో వేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్‌లో పెట్టుబడుల కోసం ప్రముఖ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైటెక్‌ సిటీ తరహాలో నగర శివార్లలో కొత్తగా మరో రెండు ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తాం. వీటి ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై అధికారులు అధ్యయనం చేస్తారు. ఐటీ పార్కుల్లో పనిచేసే ఉద్యోగులకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు రవాణా సౌకర్యాలు కల్పిస్తాం. నగరంలోని నలుమూలల నుంచి ఈ పార్కులకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తాం. 

ఈ పార్కుల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు అవకాశం కల్పిస్తాం’అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారు. ‘పెట్టుబడులతో ముందుకొచ్చే పరిశ్రమలకు భూకేటాయింపులపై ఇప్పటివరకు ప్రత్యేక పాలసీ లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ప్రత్యేక పాలసీని రూపొందించి పెట్టుబడి, కల్పించే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా భూమిని కేటాయిస్తాం. 

హైదరాబాద్‌లో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన డ్యూ సాఫ్ట్‌ వేర్‌ కంపెనీకి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకరిస్తాం’అని శ్రీధర్‌బాబు వివరించారు. కార్యక్రమంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ ఎండీ డా.విష్ణువర్ధన్‌రెడ్డి, టీజీఐఐసీ సీఈవో మధుసూదన్, ‘డ్యూ’వెంచర్స్‌ ప్రెసిడెంట్‌ సురేశ్, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి ఝాన్సీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

‘అలెరియా ఏఐ’తో పన్నుల రాబడిలో పెరుగుదల 
రాష్ట్ర ప్రభుత్వ పన్నుల వసూలు, ఇతర రాబడి మార్గాల్లో ఆదాయం నష్టపోకుండా ‘అలెరియా ఏఐ’టెక్నాలజీ దోహదపడుతుందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. అలెరియా ఏఐ సంస్థ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో మంత్రి ఎదుట ‘అలెరియా ఏఐ’సాంకేతికతపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 

ఆఫ్‌లైన్‌లో పనిచేసే ఈ టూల్‌ను ప్రభుత్వ విభాగాలతో అనుసంధానం చేస్తే పన్ను, ఆదాయ రాబడిలో నష్టపోతున్న 30 శాతాన్ని తిరిగి పొందవచ్చని సంస్థ ప్రతినిధులు ఆయనకు వివరించారు. 

వివిధ పథకాల్లో లబ్దిదారుల ఎంపికలో అర్హులు మాత్రమే ప్రయోజనం పొందేలా అలెరియా ఏఐ సహాయ పడుతుందని వారు వెల్లడించారు. మంత్రిని కలిసిన వారిలో ఐబీటీ సీఈవో మన్సూర్‌ అలీఖాన్, అలెరియా సీఈవో ఎరిక్‌ లియాండ్రీ, ఇన్నోలాజిక్‌ సీఈవో శివ దొండపాటి తదితరులు ఉన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement