ప్రపంచంలో 20 కోట్ల మందికి ఆ వ్యాధి.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పే

Twenty Crore people in the World have Osteoporosis: Dr Dasaradha Rama Reddy - Sakshi

యాభై ఏళ్లు దాటిన ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరికి వ్యాధి 

క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం శ్రేయస్కరం 

నేడు ప్రపంచ ఆస్టియోపోరోసిస్‌ డే సందర్భంగా డాక్టర్‌ దశరథరామారెడ్డితో ఇంటర్వ్యూ

సాక్షి, హైదరాబాద్‌: కొన్ని ప్రమాదకరమైన వ్యాధులు శరీరంలో రహస్యంగా పొంచి ఉండి ఊహించని రీతిలో అకస్మాత్తుగా బయటపడతాయి. ఆ కోవకు చెందినదే ఈ ఆస్టియోపోరోసిస్‌ (బోలు ఎముకల వ్యాధి). ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మందికిపైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. ప్రపంచంలో యాభై ఏళ్లు పైబడిన ముగ్గురు మహిళల్లో ఒకరు, ఐదుగురు పురుషుల్లో ఒకరికి తమ జీవితకాలంలో ఆస్టియోపోరోసిస్‌ వ్యాధి వల్ల ఎముకలు విరిగే ప్రమాదం ఉంటుందని ప్రముఖ ఆర్ధోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ దశరథరామారెడ్డి అంటున్నారు. గురువారం (అక్టోబర్‌ 20) ప్రపంచ ఆస్టియోపోరోసిస్‌ డే సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... 

ఆస్టియోపోరోసిస్‌ అంటే?  
ఆస్టియోపోరోసిస్‌ అనే వ్యాధి ఎముకలు వాటి ఖనిజ సాంద్రతను కోల్పోయి, పెళుసుబారిపోవడం వల్ల ఏర్పడుతుంది. ఈ వ్యాధి ఎముకలను బలహీనపరిచి అవి విరిగిపోయేలా చేస్తుంది. తుంటి ఎముకలు, పక్క టెముకలు, మణికట్టు ఇంకా వెన్నెముక వంటి ఎముకలు విరిగే (ఫ్రాక్చర్‌) అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆస్టియోపోరోసిస్‌ వ్యాధిని కారణాలను బట్టి వర్గీకరించవచ్చు. ప్రైమరీ ఆస్టియోపోరోసిస్‌ అనేది సహజమైన వయస్సు సంబంధిత మార్పుల వల్ల ఎముకల సాంద్రత తగ్గి వస్తుంది. సెకండరీ ఆస్టియోపోరోసిస్‌ కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులవల్ల లేదా మందుల వల్ల కలుగుతుంది. 

ఈ వ్యాధి లక్షణాలేంటంటే... 
సాధారణంగా ప్రారంభ దశల్లో ఈ వ్యాధి వస్తే ప్రత్యేకంగా లక్షణాలేవీ కనిపించవు. వ్యాధి క్రమంగా తీవ్రమై ఎముకలు విరిగినప్పుడు మాత్రమే గు­ర్తించగలం. ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే... వీపు కింది భాగంలో నొప్పి వస్తుంది. పరిస్థితి తీవ్రమైనప్పుడు ఎత్తు తగ్గిపోవడం, వెన్నెముక విరగడం వల్ల శరీరం ముందుకు వంగిపోవడం, శరీర భంగిమల్లో మార్పు, శ్వాస ఆడకపోవడం జరుగుతుంది. పరిస్థితి చాలా తీవ్రంగా మారినప్పుడు బలమైన తుమ్ము లేదా దగ్గు వల్ల కూడా ఎముకలు విరుగుతాయి.  

వ్యాధి నిర్ధారణ ఎలా చేయగలమంటే?  
డీఎక్స్‌ఏ అనే రేడియేషన్‌ ఎక్స్‌–రే స్కాన్‌ ద్వారా తుంటి, ఇంకా వెన్నెముక ఎముకల సాంద్రతను, ఎముకలలోని ఖనిజాల సాంద్రతను కొలవడానికి వీలవుతుంది. ఈ పరీక్షతో వ్యాధిని నిర్ధారించడానికి, ఫ్రాక్చర్‌ ప్రమాదాన్ని అంచనా వేయడానికి అత్యంత కచ్చితమైన మార్గం. ఇతర వ్యాధులు కూడా ఉన్నట్లయితే రక్తం, మూత్ర పరీక్షలు కూడా అవసరం కావచ్చు. 

ప్రమాద కారకాలేంటి? 
ఆస్టియోపోరోసిస్‌ వ్యాధి ఆడా, మగా ఎవరికైనా రావచ్చు. అయితే ప్రమాదం వయస్సుతో పాటు పెరుగుతుంది. స్త్రీలలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ వారిని ‘బోన్‌ లాస్‌’నుండి కాపాడుతుంది. 50 ఏళ్లు పైబడిన మహిళల్లో (లేదా ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో) ఈస్ట్రోజెన్‌ లేకపోవడం వల్ల ఆస్టియోపోరోసిస్‌ వ్యాధి వచ్చే ప్రమాదం పురుషుల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. క్యాల్షియం, విటమిన్‌ డీ ఇంకా ఇతర విటమిన్లు, ఖనిజాల కొరతతో కూడిన ఆహారం తీసుకోవడం, సరైన శారీరక బరువును సరిగా నిర్వహించకపోవడం తదితర కారణాలతో ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. 

జీవనశైలిలో మార్పులు అవసరం
కొన్ని జీవనశైలి మార్పులను చేసుకోవాలి. ప్రతి రోజూ వ్యాయామం చేయడం, క్యాల్షియం, విటమిన్‌ డి వంటి విటమిన్లతో కూడిన ఆహరం ద్వారా లేక మందుల ద్వారా తీసుకోవడం వంటివి చేయాలి. అవసరమైతే కొన్నిసార్లు ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాల్సి రావచ్చు. పురుషుల్లో టెస్టోస్టెరాన్‌ థెరపీ ఎముకల సాంద్రతను పెంచడంలో సహాయపడవచ్చు. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఇవ్వడం ద్వారా ఎముకల సాంద్రత తగ్గడం వల్ల కలిగే నష్టాన్ని ఆపొచ్చు. కేవలం ఆర్థోపెడిక్‌ సర్జన్‌ సూచించినట్లయితేనే హార్మోన్‌ థెరపీ తీసుకోవాలి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top