ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్‌ కాలితే వాతే!

TSSPDCL: If Smart Meter Stops Working You May Pay High - Sakshi

ఆరేళ్ల నాటి అధిక ధరలతో మీటర్‌ వ్యయం వసూలు

 పాతవి కొన్ని రిజర్వులో... వాటికి నాటి ధరలే వేస్తున్న వైనం

 టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ యాజమాన్య నిర్ణయం

గతంతో పోల్చితే ప్రస్తుతం నాలుగింతలు తగ్గిన ధరలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్లు కాలిపోతే వినియోగదారుల నుంచే వాటి విలువను ఆరేళ్ల కింద ఉన్న అధిక ధరలతో వసూలు చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) నిర్ణయం తీసుకుంది. మీటర్‌ వ్యయాన్ని వినియోగదారుల నెలవారీ విద్యుత్‌ బిల్లులో కలిపి వసూలు చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సింగిల్‌ ఫేజ్‌ ప్రీపెయిడ్‌ మీటర్‌కు రూ.8,687, త్రీఫేజ్‌ ప్రీపెయిడ్‌ మీటర్‌కు రూ.11,279 వ్యయాన్ని జీఎస్టీతో కలిపి వసూలు చేయాలని అన్ని సర్కిళ్ల పర్యవేక్షక ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసింది.  

4 రెట్లు అధిక వ్యయం 
గత కొంతకాలంగా బహిరంగ మార్కెట్లో ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల ధరలు భారీగా తగ్గిపోయాయి. 2017 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఈఈఎస్‌ఎల్‌) నిర్వహించిన టెండర్లలో రూ.2,503కే సింగిల్‌ ఫేజ్‌ ప్రీపెయిడ్‌ మీటర్‌ విక్రయించడానికి ఐటీఐ లిమిటెడ్‌ అనే కంపెనీ ముందుకు వచ్చింది. అంతకుముందు టెండర్లలో రూ.2,722కే ఈ మీటర్‌ను విక్రయించడానికి ఎల్‌అండ్‌టీ సంస్థ బిడ్‌ దాఖలు చేసింది. దేశంలోని విద్యుత్‌ వినియోగదారులందరికీ దశలవారీగా ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో వీటికి డిమాండ్‌ భారీగా పెరిగిపోయి ధరలు ఇంకా పతనం అవుతున్నాయి. మరోవైపు కాలిపోయిన మీటర్ల వ్యయాన్ని వినియోగదారుల నుంచి 6 ఏళ్ల కింద ఉన్న నాలుగైదు రెట్ల అధిక ధరలతో వసూలు చేయాలని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ యాజమాన్యం నిర్ణయించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టు కింద జీడిమెట్ల పారిశ్రామికవాడలోని పరిశ్రమలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్‌ మీటర్లను టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఏర్పాటు చేసింది. ఇందుకోసం దాదాపు 20 వేల మీటర్లను సింగిల్‌ ఫేజ్‌ మీటర్‌కు రూ.8,687, త్రీఫేజ్‌ మీటర్‌కు రూ.11,279 చెల్లించి ఆరేళ్ల కింద టెండర్ల ద్వారా కొనుగోలు చేసింది. వీటిలో కొన్ని రిజర్వులో ఉన్నాయి. ఎక్కడైనా స్మార్ట్‌మీటర్‌ పాడైతే... గతంలో అధిక ధరలకు కొన్నవాటినే బిగి స్తున్నామని, సంస్థ నిబంధనల ప్రకారం ఈ ధరలనే వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నట్టు ఓ అధికారి వివరించారు. కొత్తగా ప్రీపెయిడ్‌ మీటర్లు కొనుగోలు చేసే వరకు ఈ పాత ధరలే కొనసాగుతాయని పేర్కొంటున్నారు. ఈ అంశంపై టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి వివరణ కోసం ‘సాక్షి’ప్రయత్నించగా, ఆయన స్పందించలేదు.

చదవండి:
హైదరాబాద్‌ ఐఎస్‌బీ.. మరో ఘనత

కేటుగాళ్లు.. సీసీ కెమెరాలపైకి పొగను పంపి..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top