ఆ ఆరు పరీక్షలపై దృష్టి | TSPSC Actions for Conducting Canceled and Postponed Exams | Sakshi
Sakshi News home page

ఆ ఆరు పరీక్షలపై దృష్టి

Mar 31 2023 3:53 AM | Updated on Mar 31 2023 3:53 AM

TSPSC Actions for Conducting Canceled and Postponed Exams - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో రద్దయిన, వాయిదా పడిన అర్హత పరీక్షలను మళ్లీ నిర్వహించడంపై టీఎస్‌పీఎస్సీ దృష్టి పెట్టింది. ఈ వార్షిక సంవత్సరంలో 26 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసిన కమిషన్, ఏడు పరీక్షలను నిర్వహించగా ఇందులో నాలుగు రద్దయ్యాయి.

రెండు పరీక్షలను చివరి నిమిషంలో వాయిదా వేశారు. కాగా ఇప్పటికే గ్రూప్‌–1 పరీక్ష నిర్వహణ తేదీని ప్రకటించిన కమిషన్‌.. రెండ్రోజుల క్రితం అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ) పరీక్షల తేదీలను కూడా వెల్లడించింది. మిగతా నాలుగు పరీక్షలకు అతి త్వరలో తేదీలను ప్రకటించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 

తేదీల సర్దుబాటు .. 
ఆ ఆరు పరీక్షలకు కొత్తగా ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్ష కేంద్రాల ఎంపిక, హాల్‌టికెట్ల జారీ తదితర ప్రక్రియను తిరిగి చేపట్టాల్సి ఉండగా.. ఈ మేరకు చర్యలను టీఎస్‌పీఎస్సీ వేగవంతం చేసింది. పరీక్షల తేదీలను ఖరారు చేసేందుకు వీలుగా.. వీటి తో పాటు ఇతర పరీక్షల తేదీల సర్దుబాటు చేపట్టింది.

ఈ క్రమంలోనే వచ్చేనెల 4వ తేదీన నిర్వహించాల్సిన హార్టీకల్చర్‌ ఆఫీసర్‌ అర్హత పరీక్షను జూన్‌ 17కు వాయిదా వేసింది. గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షను జూన్‌ 11న నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఏఈఈ పరీక్షలను మే నెల 8, 9, 21 తేదీల్లో నిర్వహించనున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మిగతా నాలుగు పరీక్షలు కూడా మే నెలాఖరులోగా పూర్తి చేసే లక్ష్యంతో ప్రణాళికను తయారు చేస్తోంది.  

అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో.. 
ఒకసారి పరీక్ష రాసిన అభ్యర్థి మళ్లీ అదే పరీక్ష రాయాలంటే కష్టమే. పరీక్షకు తిరిగి పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాల్సిందే. అయినా ఆశించిన ఫలితం రాకపోవచ్చనేది అభ్యర్థుల ప్రధాన ఆందోళన. ఈ నేపథ్యంలోనే ఎక్కువ జాప్యం చేయకుండా వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement