TS SSC Hall Ticket 2023: ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ ఎగ్జామ్స్‌.. 11 పేపర్లకు బదులు 6 పేపర్లతో పరీక్షలు

TS SSC Exam Date 2023 out  - Sakshi

2,652 పరీక్ష కేంద్రాలు, 4,94,620 మంది విద్యార్థులు

ఇందులో రెగ్యులర్‌ విద్యార్థులు 4,85,826 మంది

ఇప్పటికే అన్ని పాఠశాలలకు హాల్‌ టికెట్లు

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్‌ 3వ తేదీన ప్రారంభమయ్యే పరీక్షలు 13వ తేదీ వరకు జరుగుతాయి. గత సంవత్సరం వరకు పదోతరగతిలో 11 పేపర్లతో పరీక్షలు జరగగా, వాటిని ఈసారి 6 ప్రశ్నపత్రాలకు కుదించారు.

ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కాంపోజిట్‌ కోర్సు, సైన్స్‌ పేపర్ల వ్యవధి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు ఉంటుంది. 2,652 కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు 4,94,620 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 4,85,826 మంది రెగ్యులర్‌ విద్యార్థులు ఉన్నారు.

కాగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను ఈ నెల 24 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు పంపించినట్లు విద్యాశాఖ తెలిపింది. హాల్‌టికెట్లను బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌ www.bse. telangana.gov.in  నుంచి కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు
పదో తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులు పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేశారు. పరీక్షా సిబ్బంది, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల నియామకంతో పాటు స్టోరేజీ పాయింట్లకు రహస్య సామగ్రి పంపిణీ ప్రక్రియ పూర్తయింది. పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.

పరీక్ష విధులకు నియమించిన సిబ్బంది అందరికీ గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ పూర్తయినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థుల కోసం ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్‌లను ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షలు జరిగే అన్ని రోజులలో ఒక ఏఎన్‌ఎంను పరీక్ష కేంద్రానికి డిప్యూట్‌ చేయడం జరుగుతుంది.

విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా టీఎస్‌ఆర్‌టీసీ ఎక్కువ సంఖ్యలో బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది.  ప్రిపరేషన్‌ రోజులలో, పరీక్షా కాలంలో విద్యుత్‌ శాఖ నిరంతర విద్యుత్‌ సరఫరాను అందించనుందని ప్రభుత్వం తెలిపింది. పదో తరగతి పరీక్షలకుసంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లు, డీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు  ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top