కేంద్రంలో ఆర్థిక మంత్రులు మారుతున్నా.. తెలంగాణకు దక్కింది శూన్యమే

ts it industrial minister ktr comments central government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో ఆర్థిక మంత్రులు మారుతున్నా తెలంగాణతోపాటు టెక్స్‌టైల్‌ రంగానికి దక్కింది శూన్యమేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం వచ్చే ఏడాది ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌ చివరిదని, అందులో నేత కార్మికులు, టెక్స్‌టైల్‌ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. నేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా కేంద్రం నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందలేదన్నారు.

ఈమేరకు కేటీఆర్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ప్రాధాన్యతను కేంద్రం గుర్తించడం లేదని, రూ.1600 కోట్లతో చేపట్టిన ఈ పార్క్‌లో మౌలిక వసతుల కల్పనకు రూ.900 కోట్లు కేటాయించాలని కోరారు. టెక్స్‌టైల్‌ రంగానికి ప్రోత్సాహం లేనందునే బంగ్లాదేశ్, శ్రీలంక వంటి చిన్న దేశాల కంటే భారత్‌ వెనుకబడి ఉందన్నారు. మౌలిక వసతుల కల్పన, ప్రోత్సాహకాల విధానం లేనందునే మేకిన్‌ ఇండియా నినాదంగానే మిగిలిపోయిందన్నారు. తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలకు సహకరించాలని కోరారు. 

మెగా క్లస్టర్‌కు రూ.100 కోట్లు ఇవ్వండి 
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సిరిసిల్ల పవర్‌లూమ్‌ క్లస్టర్‌లో 25 వేల మరమగ్గాలు ఉన్నందున మెగా క్లస్టర్‌గా గుర్తించి రూ.100 కోట్లు ఇవ్వాలని కేటీఆర్‌ కోరారు. సిరిసిల్ల మరమగ్గాల ఆధునికీకరణ, వాల్యూచైన్‌ బలోపేతం, మార్కెట్, నైపుణ్యాభివృద్ధి తదితరాల కోసం రూ.990 కోట్లు కేటాయించాలన్నారు.

పవర్‌లూమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా మరమగ్గాల రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకుని ‘ఇన్‌–సిటు పవర్‌లూమ్‌ అప్‌గ్రెడేషన్‌’కింద 13వేల మరమగ్గాల ఆధునికీరణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ‘రాష్ట్రంలో 40వేల మంది నేత కార్మికులు పనిచేస్తున్నందున ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ సంస్థను మంజూరు చేయాలి. చేనేత ఉత్పత్తులపై ప్రతిపాదించిన జీఎస్‌టీని పూర్తిగా రద్దు చేయాలి.

దేశంలో చేనేత, వస్త్ర పరిశ్రమలో 80శాతం చిన్న, సూక్ష్మ యూనిట్లు ఉన్నందున పన్నుల భారం తగ్గించాలి. ప్రస్తుతమున్న రూ.20 లక్షల జీఎస్టీ స్లాబ్‌ను చేనేత, పవర్‌లూమ్‌ కార్మికులకు రూ.50 లక్షల వరకు పెంచాలి’అని కోరారు. వచ్చే బడ్జెట్‌లో తెలంగాణ టెక్స్‌టైల్‌ రంగానికి భారీగా నిధులు కేటాయించాలని, రాష్ట్రానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేటీఆర్‌ కోరారు. టెక్స్‌టైల్‌ రంగానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు పునఃసమీక్షించుకోవాలని హితవు పలికారు. మోదీ ప్రభుత్వం రద్దు చేసిన ఆల్‌ ఇండియా హ్యాండూŠల్‌మ్, పవర్‌లూమ్, హ్యాండీక్రాఫ్ట్‌ మండళ్లను తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top