చరిత్రలో నిలిచిపోయే కట్టడాలు నిర్మించాలి

TS High Court suggested that the structures should be constructed for the benefit of the people - Sakshi

70 ఏళ్లయినా నిజాం కట్టడాలను ఇప్పటికీ తల్చుకుంటాం 

ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాలు చేపట్టాలి 

ఉస్మానియా ఆస్పత్రి వ్యవహారంపై హైకోర్టు 

ఈ కేసును భౌతికంగా విచారణ చేపట్టాలి  

విచారణను 24కు వాయిదా వేసిన ధర్మాసనం 

సాక్షి, హైదరాబాద్‌: ‘హైకోర్టు, ఉస్మానియా ఆస్పత్రి, ఆర్ట్స్‌ కళాశాల, ట్యాంక్‌బండ్‌ లాంటి నిర్మాణాలను చూసినప్పుడల్లా నిజాం గుర్తుకొస్తారు. నిజాం పాలన అంతమై 70 ఏళ్లు గడిచినా ఆ కట్టడాలను ఇప్పటికీ తల్చుకుంటాం. ఇలాంటి పది కాలాల పాటు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయే, ప్రజలకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేపట్టాలి’అని హైకోర్టు సూచించింది. ఉస్మానియా ఆస్పత్రి వ్యవహారంపై విచారిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలోని హెరిటేజ్‌ భవనాన్ని కూల్చివేసి కొత్త నిర్మాణాలను చేపట్టాలా? లేదా? ఆ భవనాన్ని అలాగే ఉంచి ఖాళీ స్థలంలో నూతన నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించాలా? అన్నది లోతుగా విచారించి తేల్చాల్సిన అంశమని స్పష్టం చేసింది.

ఆస్పత్రి ఆవరణలోని హెరిటేజ్‌ భవనాన్ని కాపాడాలని కొందరు, కూల్చివేసి నూతన భవనాన్ని నిర్మించాలంటూ మరికొందరు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యా లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. గతంలో ధర్మాసనం ఆదేశించిన మేరకు ఆస్పత్రి ఆవరణకు సంబంధించిన గూగుల్‌ మ్యాప్, భవనాల సైట్‌ ప్లాన్‌ను అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ సమర్పించారు. ఈ మ్యాప్‌లను పరిశీలిస్తే ఆస్పత్రి భవన సముదాయంలో ఖాళీ స్థలాలు ఏమీ కనిపించడం లేదని కోర్టు పేర్కొంది. 26 ఎకరాల్లో ఆస్పత్రి విస్తరించి ఉందని, అయితే ప్రభుత్వం మా త్రం 16.2 ఎకరాల్లో మాత్రమే ఉందని ఎలా చెబుతుందో అర్థం కావడం లేదని సీనియర్‌ న్యాయవాది సత్యంరెడ్డి అభ్యంతరం వ్య క్తం చేశారు. 2013లో ప్రభుత్వం నియమిం చిన క్షేత్రా డెవలపర్స్‌ ఇచ్చిన నివేదికను ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మ్యాప్‌లు, సైట్‌మ్యాప్‌లను పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు ఇవ్వాలని ఏజీకి ధర్మాసనం సూచించింది.  

6 ఏళ్ల నుంచి ట్విన్‌ టవర్స్‌ నిర్మాణం...  
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉస్మానియాలో వెంటనే నూతన భవనాల నిర్మాణం చేపట్టేలా ఆదేశించాలంటూ ఓ పిటిషనర్‌ తర ఫున న్యాయవాది సందీప్‌రెడ్డి హైకోర్టుకు నివే దించారు. ఈ మేరకు ధర్మాసనం  స్పందిస్తూ.. ‘తాజ్‌మహాల్‌ నిర్మాణానికి 22 ఏళ్లు పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పో లీసు ట్విన్‌ టవర్స్‌ను ఆరేళ్ల నుంచి నిర్మిస్తు న్నప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికిప్పుడు నూతన భవనాల నిర్మాణం ప్రారంభించినా కనీసం పూర్తి కావడానికి ఐదేళ్ల సమయం పడుతుంది. కొత్త నిర్మాణాలు ఎక్కడ చేపట్టాలన్న దానిపై లోతుగా విచారణ జరపాల్సి ఉంది. కేసులను భౌతికంగా విచారించేందుకు కోర్టు సిద్ధంగా ఉన్నా న్యాయవాదులు హాజరు కావడానికి జంకుతున్నారు. భౌతిక కోర్టులు ప్రారంభించాలని కోరిన న్యాయవాదులే ఇప్పుడు మరో 4 వారాలపాటు ఆన్‌లైన్‌లోనే కేసులను విచారించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో భౌతికంగా ఈ కేసును విచారించాల్సిన అవసరముంది’ అని పేర్కొంటూ కేసును ఈ నెల 24కు వాయిదా వేసింది.     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top