డిగ్రీలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌

TS Government Start Artificial Intelligence In Degree Course - Sakshi

జూలై 1 నుంచి 15 వరకు డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్‌ 

3 నుంచి 16 వరకు వెబ్‌ ఆప్షన్లు 22న సీట్లు కేటాయింపు.. 

సెప్టెంబర్‌ 1 నుంచి తరగతులు డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న ఆర్టి ఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను డిగ్రీలో ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యా మండలి, కళాశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. 2021–22 విద్యా సంవత్సరంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో (బీబీఏ) మూడు రకాల కొత్త కాంబినేషన్లను అమల్లోకి తీసుకొస్తోంది. బీబీఏ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పాటు బీబీఏ ఫైనాన్షియల్‌ అకౌంటెన్సీ, బీబీఏ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ స్కిల్స్‌ కోర్సులను ఈ ఏడాది అందుబాటులోకి తేనుంది. ఇందుకు అవసరమైన కసరత్తును ప్రారంభించింది. మార్కెట్‌లో ఉపా«ధి అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులను డిగ్రీలో ప్రవేశపెట్టే కార్యాచరణను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గతేడాది బీఎస్సీ డేటా సైన్స్, బీకాం బిజినెస్‌ అనలిటిక్స్‌ వంటి కోర్సులను ప్రవేశపెట్టగా, ఈసారి బీబీఏలో మూడు కొత్త కాంబినేషన్లతో కోర్సులను ప్రవేశపెడుతోంది. ఈ కోర్సులను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ప్రైవేటు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోగా, వాటితో పాటు ప్రభుత్వ కాలేజీల్లోనూ ఆయా కోర్సులను ప్రవేశ పెట్టేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. 

రేపటి నుంచి డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల రిజిస్ట్రేషన్‌ 
రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ తదితర డిగ్రీ కోర్సుల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాల నోటిఫికేషన్‌ను డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) జారీ చేసింది. మంగళవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రవేశాల ప్రకటనను అధికారులు జారీ చేశారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, కళాశాల విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, మండలి వైస్‌ చైర్మన్, దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి పాల్గొన్నారు. జూలై 1 నుంచి 15 వరకు విద్యార్థులు తమ ఇంటర్మీయట్‌ హాల్‌ నంబర్‌ సాయంతో దోస్త్‌ వెబ్‌సైట్‌లో (https://dost.cgg.gov.in) రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా చర్యలు చేపట్టారు. రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి నిర్వహించే డీహెచ్‌ఎంసీటీ, డీఫార్మసీ కోర్సుల్లోనూ దోస్త్‌ ద్వారానే ప్రవేశాలు చేపట్టనున్నారు. రిజిస్టర్‌ చేసుకున్న విద్యార్థులు జూలై 3 నుంచి 16 వరకు కాలేజీల వారీగా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మొదటి దశ సీట్లను జూలై 22న కేటాయిస్తారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top