నామినేటెడ్‌ పోస్టులెప్పుడు?

TRS Leaders Waiting For The Nominated Posts - Sakshi

టీఆర్‌ఎస్‌లో నేతలు, కార్యకర్తల ఎదురుచూపులు 

కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ విజ్ఞప్తులు 

కాలపరిమితి పూర్తయినా కొత్త పాలకమండళ్లు లేవు 

ప్రధాన దేవాలయాలు, గ్రంథాలయ సంస్థలదీ ఇదే పరిస్థితి 

పర్సన్‌ ఇన్‌చార్జుల పాలనలో 30 వ్యవసాయ మార్కెట్లు 

త్వరలోనే ఈ పోస్టులను భర్తీ చేయవచ్చంటున్న పార్టీ వర్గాలు 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తోంది. ఇప్పటికీ చాలా ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు కొత్త పాలక మండళ్ల నియామకం జరగలేదు. ఆ నామినేటెడ్‌ పదవుల కోసం పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారో, తమకు ఎప్పుడు అవకాశం వస్తుందో అనే ఆశతో కీలక నేతల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో ఏడాదిన్నర గడిస్తే అసెంబ్లీ ఎన్నికల వాతావరణం మొదలయ్యే అవకాశం ఉండటంతో.. వీలైనంత త్వరగా నామినేటెడ్‌ పదవుల భర్తీ జరగాలని కోరుతున్నారు. రాష్ట్రస్థాయిలోనే కాకుండా జిల్లాల్లో దేవాలయాలు, మార్కెట్‌ కమిటీలు, గ్రంథాలయ సంస్థల పదవులు కూడా ఖాళీగా ఉండటంతో.. తమకు అవకాశం ఇవ్వాలంటూ కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక హడావుడి ముగిశాకగానీ, అక్టోబర్‌ తర్వాతగానీ నామినేటెడ్‌ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

అప్పుడప్పుడు ఒకట్రెండు.. 
టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక పరిమిత సంఖ్యలో మాత్రమే నామినేటెడ్‌ పదవుల భర్తీ జరిగింది. రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లో ప్రభుత్వ రంగ సంస్థలు, చట్టబద్ధమైన కార్పొరేషన్లలో సుమారు 50కి పైగా పాలకమండళ్లు ఉన్నాయి. వాటిలో గణనీయంగానే ఖాళీలు ఉన్నాయి. మహిళా కమిషన్, టీఎస్‌పీఎస్సీ వంటి సంస్థలకు కోర్టు విధించిన గడువుకు తలొగ్గి నియమకాలు జరిపినట్టు విమర్శలు వచ్చాయి. రైతుబంధు సమితి, అటవీ అభివృద్ధి సంస్థ, మూసీ రివర్‌ ఫ్రంట్‌ కార్పొరేషన్, టీఎస్‌ఐఐసీ, సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ తదితరాలకు కొత్త పాలకమండళ్లను నియమించారు. టీఎస్‌ఐఐసీ, స్పోర్ట్స్‌ అథారిటీ, వికలాంగుల కార్పొరేషన్‌కు గతంలో ఉన్న వారినే కొనసాగించారు. ఇటీవల హుజూరాబాద్‌కు చెందిన బండా శ్రీనివాస్‌ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. సాంస్కృతిక సారథి చైర్మన్‌గా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను మరోమారు నియమించారు. కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం జరిగినా సభ్యులను భర్తీ చేయకపోవడంతో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగడం లేదు. 

భారీగానే ఆశావహులు.. 
తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ పనిచేస్తున్న వారితోపాటు వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన నేతలతో టీఆర్‌ఎస్‌లో అన్నిచోట్లా బహుళ నాయకత్వం ఏర్పడింది. సుమారు 60కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో విపక్షాలు బలహీనపడగా.. టీఆర్‌ఎస్‌లో ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు బలమైన నేతలు ఉన్నారు. శాసనసభ, శాసనమండలి, జెడ్పీ చైర్మన్, మున్సిపల్‌ మేయర్లు, చైర్మన్లుగా అవకాశాలు కల్పించినా.. ఇంకా రాష్ట్రస్థాయి పదవులను ఆశిస్తున్న నేతల జాబితా భారీగానే ఉంది. వివిధ సందర్భాల్లో పార్టీ అవసరాలతోపాటు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పదవులు భర్తీ చేస్తున్నా.. ఖాళీగా ఉన్న పదవులు ఆశావహులను ఆకర్షిస్తున్నాయి. ఆయా నేతలు సీఎం కేసీఆర్, కేటీఆర్‌లతోపాటు ఇతర కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే నామినేటెడ్‌ పదవుల భర్తీపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉందని.. ఎవరికి ఏ తరహా పదవులు ఇవ్వాలో ఆయనకు తెలుసని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి సరైన సమయంలో అవకాశాలు వస్తాయని పేర్కొంటున్నాయి. 

ఈ పదవులన్నీ ఖాళీయే.. 
పలు ప్రభుత్వ శాఖల పరిధిలోని కార్పొరేషన్లకు ఏళ్ల తరబడి పాలకమండళ్లను నియమించలేదు. బేవరేజెస్‌ కార్పొరేషన్, ఆర్టీసీ, పరిశ్రమల శాఖ పరిధిలో పలు సంస్థలకు పాలకమండళ్ల నియామకం జరగలేదు. మిషన్‌ భగీరథ, ఎస్టీ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, సాహిత్య అకాడమీ, ఎంబీసీ, స్టేట్‌ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ, టెస్కోవంటి సంస్థల పదవులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాస్థాయిలో గ్రంథాలయ సంస్థల పాలక మండళ్ల పదవీకాలం ముగిసినా పాతవారినే కొనసాగిస్తూ వస్తున్నారు. కాళేశ్వరం, వేములవాడ, యాదాద్రి తదితర ప్రధాన ఆలయాలు కూడా ఏళ్ల తరబడి పాలక మండళ్లు లేకుండానే ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని 192 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు గాను 30 కమిటీలకు పాలకమండళ్లు లేవు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top