
ఖైరతాబాద్: అశేష భక్తజనం పూజలందుకున్న శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి సాగర నిమజ్జనానికి తరలించేందుకు ఎస్టీసీ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన ట్రైలర్ వాహనం శనివారం ప్రాంగణానికి చేరుకుంది. వెల్డింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ట్రైలర్ పొడవు 75 అడుగులు, 11 అడుగుల వెడల్పు.
26 టైర్లు ఉన్న ఈ వాహనం 100 టన్నుల బరువు వరకు కూడా మోయగలదు. ఖైరతాబాద్ మహా గణపతిని నిమజ్జనానికి తరలించే వాహన సారథిగా నాగర్‌కర్నూల్ జిల్లా గౌతంపల్లి గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి ఈసారి కూడా వ్యవహరించనున్నారు. ‘మహా గణపతి బరువు 70 టన్నుల వరకు ఉంటుంది. నిమజ్జన సమయంలో ఎలాంటి పగుళ్లు రాకుండా నాలుగు లేయర్లుగా తయారీ చేశాం. 4 గంటల పాటు వర్షం వచ్చినా కరిగిపోదు. నిమజ్జనం పూర్తిచేసిన 7 గంటల్లో నీటిలో కరిగిపోతుంది’ అని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు.