
ఏ మార్గంలో వెళ్లాలన్న దానిపై కొరవడిన స్పష్టత
రోజుకో మలుపు తిరుగుతున్న బీసీ రిజర్వేషన్ల అంశం
పూటకో ఆలోచనతో స్థానిక నాయకత్వంలో గందరగోళం
అభిప్రాయ సేకరణ కోసం రేపు టీపీసీసీ కార్యవర్గం భేటీ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన అంశం పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది. అసలు ఎన్నికలకు వెళ్లాలో, వద్దో అర్థం కాని పరిస్థితుల్లో అధికార పార్టీకి చిక్కుకుంది. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు సంబంధించి రాష్ట్రపతి వద్ద ఆర్డినెన్స్, గవర్నర్ వద్ద ఉన్న బిల్లుల భవితవ్యం ఎటూ తేలకపోవటంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో అధికార పార్టీ పడిపోయింది. ఒక దశలో వెంటనే ఎన్నికలకు వెళ్లాలని భావించినా.. తర్వాత ప్రభుత్వం మనసు మార్చుకుంది.
గవర్నర్లు, రాష్ట్రపతి వద్దకు వెళ్లే బిల్లుల ఆమోదం విషయంలో సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు విచారణ తేలేవరకు వేచి ఉందామని నిర్ణయించింది. సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు వస్తే తమ ఆర్డినెన్స్ చట్టం అవుతుందని, అప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో చట్టబద్ధత చేకూరుతుందనే ఆలోచనకు వచ్చింది. దీంతో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), మంత్రివర్గ సమావేశం, పార్టీ అంతర్గత భేటీలు, సీఎం, పీసీసీ చీఫ్, ఇతర సీనియర్ మంత్రుల సమావేశాల్లో వచ్చిన అభిప్రాయాలన్నింటినీ పక్కన పెట్టి ఎన్నికలకు మరికొంత సమయం వేచి ఉండాలనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
కిందిస్థాయిలో గందరగోళం
రాష్ట్ర పార్టీ నాయకత్వంతో పాటు ప్రభుత్వ పెద్దల ఆలోచన, నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నాయకత్వాన్ని గందరగోళంలోకి నెడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికలకు వెళ్లడమేనన్న సంకేతాలు పార్టీ నుంచి వస్తుండగా, ఉన్నట్టుండి ఎన్నికలు వాయిదా పడతాయనే సమాచారంతో కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఎన్నికలపై స్పష్టత లేకపోవడంతో స్థానికంగా వస్తున్న రాజకీయ విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇంత చేసిన తర్వాత పార్టీపరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్లడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు. స్థానిక ఎన్నికల విషయంలో ఓ టైమ్‌లైన్ ఏర్పాటు చేసుకుని వెళ్లడమే మంచిదని సూచిస్తున్నారు.
రేపు కార్యవర్గ సమావేశం
స్థానిక ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు వారి అభిప్రాయాలు సేకరించేందుకు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. గాంధీభవన్‌లో సోమవారం ఉదయం 11 గంటలకు పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ హాజరు కాను న్నారు. పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జీలు, అనుబంధ సంఘాల చైర్మన్‌లు, కార్పొరేషన్ల చైర్మన్లు ఇతర నాయకులకు ఈ సమావేశానికి రావాలని ఇప్పటి కే సమాచారం అందింది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పోస్టులు, పార్టీ కమిటీలు, జైబాపూ–జైభీం–జై సంవిధాన్ కార్యక్రమ నిర్వహణపై చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.