
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లపై పార్టీ పెద్దలు, న్యాయ కోవిదులతో మంత్రుల చర్చలు
జీవో ఇస్తే ఎదురయ్యే అడ్డుంకులపై విశ్లేషణ
గతంలో మరాఠా రిజర్వేషన్లను కొట్టేస్తూ ఇచ్చిన తీర్పు పరిశీలన
నేడు బిహార్‌కు సీఎం రేవంత్, మంత్రులు.. రాహుల్ యాత్రకు సంఘీభావం
సాక్షి, న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై చట్టపరంగా ఎదురయ్యే చిక్కుముళ్లను విప్పేందుకు మంత్రుల బృందం పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులతో భేటీ అయింది. రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఆమోదించిన రెండు బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లోనే ఉన్నందున దీనిని చట్టపరిధిలో పరిష్కరించే మార్గాలపై సమాలోచనలు చేసింది.
ఒకవేళ జీవోలు ఇస్తే ఎదురయ్యే సవాళ్లు, దీనిని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన కార్యాచరణ, కులగణన ద్వారా వచ్చిన ఎంపిరికల్ డేటాను న్యాయవ్యవస్థల ముందుంచే అంశాలపై క్షుణ్ణంగా చర్చించింది. 50శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్న రాష్ట్రాలు, వాటిపై గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు, రాజ్యాంగ నిబంధనలన్నింటిపైనా చర్చలు జరిపింది.
రిజర్వేషన్లపై మార్గాన్వేషణ: 42 శాతం రిజర్వేషన్ల అమలు అంశంపై ఏర్పాటైన మంత్రుల కమిటీ సభ్యులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ సోమవారం ఢిల్లీలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో గంటపాటు భేటీ అయ్యారు.
ఇప్పటికే విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులు రాష్ట్రపతి కోసం వేచి చూస్తున్న విషయాలతోపాటు, 2018లో చంద్రశేఖర్ రావు రిజర్వేషన్లను 50శాతానికి పరిమితి చేస్తూ చేసిన చట్టాన్ని తొలగించాలన్న ఆర్డినెన్స్‌పైనా చర్చించారు. ఈ బిల్లుల ఆధారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 ప్రకారం బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ జీవో ఇవ్వడమా?, ఇస్తే ఈ ఉత్తర్వుల అమలును ఇతరులెవరూ కోర్టుకు వెళ్లి అడ్డుకోకుండా ముందుగానే కేవియట్ దాఖలు చేయడమా? అన్న అంశాలపై మంత్రులు సమాచాలోచనలు చేశారు.
ఒకవేళ కోర్టులు అభ్యంతరం చెబితే కులగణన సర్వే ద్వారా సేకరించిన డేటాతో బీసీల జనాభా, వెనకబాటుతనాన్ని నిరూపించే అవకాశాలపైనా చర్చించారు. ఇప్పటికే 10శాతం ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ల కోసం చేసిన 103వ రాజ్యాంగ సవరణతో విద్య, ఉద్యోగాల్లో మొత్తం రిజర్వేషన్లు 50శాతం దాటడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించిన దృష్ట్యా, సర్వే డేటాలోని అంశాలు తమకు కలిసి వస్తాయనే అభిప్రాయం వ్యక్తమైంది.
50 శాతం రిజర్వేషన్లు దాటితే సమానత్వపు హక్కు ఉల్లంఘన జరిగినట్లేనని, అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే 50శాతం పరిమితిని దాటవచ్చని సుప్రీంకోర్టు.. గతంలో మరాఠాల రిజర్వేషన్‌లపై తీర్పుఇచ్చిన నేపథ్యంలో ఎంపిరికల్ డేటాను ఎంతవరకు ప్రామాణికంగా చూపవచ్చనే అంశంపైనా చర్చించారు. హైకోర్టు విధించిన గడువు సెపె్టంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితుల్లో అదనపు గడువు కోరే అవకాశాలపైనా చర్చలు జరిగాయి. అయితే ఈ నెల 29న జరిగే కేబినెట్ భేటీలో చర్చించి తుది నిర్ణయం చేయనున్నారు.
నేడు బిహార్‌కు సీఎం, మంత్రులు
రానున్న బిహార్ ఎన్నికలకు ముందు జాతీయ ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందంటూ ఏఐసీసీ అగ్రనేత తలపెట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు పాల్గొననున్నారు. ఓట్ల చోరీపై రాహుల్ చేస్తున్న పోరాటానికి రాష్ట్ర నేతలు సంఘీభావం తెలపనున్నారు. రోడ్‌షోలో ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకగాంధీ సైతం పాల్గొనే అవకాశాలున్నాయి.