
బీసీలకు 42% కోటా బొనాంజా
అన్ని స్థాయిల్లో కలిపి మొత్తం 55 వేలకు పైగా స్థానిక పదవులు
గతంలో కంటే 2,422 సర్పంచ్ పదవులు పెరిగే అవకాశం
వార్డు సభ్యులుగా అదనంగా 20 వేల మంది బీసీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అను కున్న విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఆయా వర్గాలకు అధికారికంగా 24 వేల అదనపు స్థానిక పదవులు లభిస్తాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంకా స్పష్టంగా తేలకపోయినప్పటికీ 23,973 పదవులు అదనంగా బీసీలకు దక్కుతాయని చెపుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసు కున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో క్షేత్రస్థాయి రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని పేర్కొంటున్నాయి. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు కలిపి సుమారు 55,624 మంది బీసీ నాయకులు ఆయా పదవుల్లో కూర్చుంటారని, ఈ సంఖ్య ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశ ముందని అంటున్నాయి.
5,350కి పైగా సర్పంచులు
గ్రామ పాలనకు అధ్యక్షులుగా ఉండే సర్పంచులుగా ఈసారి 5,350 మంది బీసీ నేతలు ఎన్నిక కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,733 సర్పంచ్ పదవుల్లో బీసీలకు పెంచిన 42 శాతం రిజర్వేషన్లు అమలైతే ఈ మేరకు పదవులు దక్కనున్నాయి. గతంతో పోల్చుకుంటే 2,422 సర్పంచ్ పదవులు అధికంగా దక్కనున్నాయి. ఇక 1.12 లక్షలకు పైగా ఉన్న వార్డు సభ్యులకు గాను 47 వేలు, 5,749 ఎంపీటీసీ స్థానాల్లో 2,420 మంది బీసీలు ఎన్నిక కానున్నారు.
అదే విధంగా చెరో 565 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల్లో బీసీలకు గతం కంటే 101 స్థానాలు అధికంగా చెరో 238 స్థానాలు దక్కుతాయని అంచనా. ఇప్పటివరకు రాష్ట్రంలోని 8 జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలు బీసీలకు రిజర్వు కాగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రకారం ఆ సంఖ్య 13కు పెరిగిన విషయం తెలిసిందే. ఇలా 31 జెడ్పీ చైర్మన్ పదవుల్లో బీసీలకు ఇప్పటికే 13 దక్కడం తెలిసిందే.
కాగా గతంలో బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన ఎన్నికల్లో రిజర్వేషన్ల శాతాన్ని 34 నుంచి 23కు తగ్గించడంతో పెద్ద ఎత్తున బీసీ నేతలు అధికారికంగా ప్రజాప్రతినిధులయ్యే అవకాశం కోల్పోయారు. ఇలా కోల్పోయిన వారు కనీసం 13,346 మంది ఉంటారని అంచనా. అయితే, ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా 42 శాతం రిజర్వేషన్లు అమలైతేనే బీసీలు కనీసం 50 వేల మంది స్థానిక ప్రజాప్రతినిధులు కానున్నారు. ఒకవేళ జనరల్ స్థానాల్లోనూ బీసీలను నిలబెడితే ఆ సంఖ్య మరింత పెరుగుతుంది.
ఒకవేళ బీసీ రిజర్వేషన్లు అధికారికంగా అమలు కాకపోతే ఎలాగూ స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఎన్నికలు జరుగుతాయని, అప్పుడు అన్ని పార్టీలు ఇప్పుడు ప్రభుత్వం ఖరారు చేసిన రిజర్వేషన్ల ప్రకారమే అభ్యర్థులను నిలబెడతాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఇది తప్పనిసరి కాకపోవడంతో..ఆయా పార్టీలు బీసీలకు ఇచ్చే అవకాశాన్ని బట్టి వారికి లభించే పదవుల సంఖ్య ఆధారపడి ఉండనుంది.