ఆలస్యంగా బయలుదేరిన బెల్గావి ఫ్లైట్
శంషాబాద్: విమానం ఎక్కిన తర్వాత అనారోగ్య సమస్య తలెత్తడంతో ఓ ప్రయాణికురాలు టేకాఫ్ జరిగే విమానాన్ని నిలిపివేసి దిగిపోయిన సంఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బుధవారం మధ్యాహ్నం బెల్గావి వెళ్లేందుకు ఇండిగో విమానం 7512 విమానం సాయంత్రం 4.10 గంటలకు టేకాఫ్ తీసుకునేందుకు సిద్ధమైంది. ఇంతలోనే ఓ ప్రయాణికురాలు మౌనా రవి తాను తీవ్రమైన చర్మ సమస్యతో ఇబ్బంది ఎదుర్కొంటున్నానని తనను దింపివేయాలని కోరింది. దీంతో అధికారులు విమానం టేకాఫ్‌ను నిలిపివేసి ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె కోలుకున్నపటికి మళ్లీ ప్రయాణం కొనసాగించలేదు. దీంతో ఆమె లేకుండానే సాయంత్రం 5.25 గంటలకు విమానం టేకాఫ్ తీసుకుని బెల్గావ్ బయలుదేరింది.
బెంగళూరు విమానం రద్దు
శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానం రద్దయ్యింది. 74 మంది ప్రయాణికులతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు టేకాఫ్ తీసుకుని బయలుదేరాల్సిన విమానాన్ని ఆపరేషనల్ కారణాలతో రద్దుచేసినట్లు ఎయిర్‌లైన్ వర్గాలు వెల్లడించాయి. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.


