మీకిదే.. మా ఆహ్వానం..

Tour Packages In Hyderabad Visit Historical And Spiritual Sites - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘రండి.. హైదరాబాద్‌ను సందర్శించండి’ నగరం కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ టూర్‌లను నిర్వహిస్తున్న పర్యాటక సంస్థలు సరికొత్త నినాదంతో పర్యాటక ప్రియులను  ఆకట్టుకొనేందుకు ప్రణాళికలను రూపొందించాయి. వారం రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉండి చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక స్థలాలను సందర్శించేందు కు అనుగుణంగా ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నాయి.  

పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు.. 
రెండేళ్లపాటు కోవిడ్‌ కారణంగా నిలిచిపోయిన జాతీయ, అంతర్జాతీయ రాకపోకలను మార్చి నుంచి పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు కేంద్రం చర్యలు చేపట్టిన నేపథ్యంలో వివిధ సంస్థలు, నగరానికి చెందిన పలువురు టూర్‌ ఆపరేటర్లు, నిర్వాహక సంస్థలు, ఇంటాక్‌ తదితర సంస్థలతో జీఎమ్మార్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  

అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రానున్న రోజుల్లో పర్యాటకుల రద్దీ  భారీగా ఉండే అవకాశం ఉందని వివిధ విభాగాలకు చెందిన  ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ముచ్చింతల్‌లో కొలువుదీరిన సమతామూర్తి విగ్రహం, యాదాద్రి, రామప్ప ఆలయం తదితర క్షేత్రాలను సందర్శించేందుకు జాతీయ స్థాయి పర్యాటకులతో పాటు, విదేశీ పర్యాటకులు కూడా ఎక్కువ సంఖ్యలో నగరానికి రావచ్చని  భావిస్తున్నారు. ఈ  క్రమంలో పర్యాటకులను ఆకట్టుకొనేందుకు హైదరాబాద్‌ నుంచి అడ్వెంచర్‌ టూర్‌లు, హైదరాబాద్‌ విహంగ వీక్షణం కోసం బర్డ్‌ ఐ టూర్‌ వంటివి నిర్వహించాలని ఆపరేటర్లు  కేంద్ర, రాష్ట్రాల పర్యాటక సంస్థలను కోరారు.  

నేరుగా విమానాలు నడపండి..  

  • జీఎమ్మార్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నతాధికారి ప్రదీప్‌ పాణికర్‌ నేతృత్వంలో జరిగిన సమావేశంలో హైదరాబాద్‌ నుంచి వివిధ దేశాలకు నేరుగా  విమానాలను నడిపేందుకు చర్యలు  తీసుకోవాలని పలువురు సూచించారు. సాధారణంగా  హైదరాబాద్‌ నుంచి రోజుకు  60 వేల మందికిపైగా రాకపోకలు సాగిస్తారు. వారిలో 10 వేల మందికి పైగా అంతర్జాతీయ ప్రయాణికులు ఉంటారు.  హైదరాబాద్‌ నుంచి  నేరుగా వెళ్లే విమానాలు పరిమితంగా ఉన్నాయి. గతంలో  చికాగోకు డైరెక్ట్‌ ఫ్లైట్‌ ప్రారంభించారు. కానీ కోవిడ్‌ కారణంగా  ఆ సర్వీసు  నిలిచిపోయింది. 
  • హైదరాబాద్‌ నుంచి వివిధ దేశాలకు  వెళ్లే వాటిలో చాలా వరకు కనెక్టింగ్‌ ఫ్లైట్‌లే ఎక్కువ. ఈ క్రమంలో ఇండోనేషియా, వియత్నాం, బంగ్లాదేశ్‌ తదితర దేశాలకు హైదరాబాద్‌ నుంచి నేరుగా విమానాలను నడిపేందుకు పలు ఎయిర్‌లైన్స్‌తో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. ఈ  మేరకు స్పైస్‌జైట్, ఇండిగో, ఏఐఆర్, తదితర అన్ని ఎయిర్‌లైన్స్‌ సంస్థలతో త్వరలో ‘హైదరాబాద్‌ ఏవియేషన్‌ సమ్మిట్‌’ నిర్వహించనున్నారు.  

(చదవండి: ప్రైవేటుతో మౌలిక వసతుల ప్రగతి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top