‘మూడింతలు’.. ముప్పుతిప్పలు | Three Month Free Ration Distribution Delay E Pos Software Issue | Sakshi
Sakshi News home page

‘మూడింతలు’.. ముప్పుతిప్పలు

Apr 4 2026 10:55 AM | Updated on Apr 4 2026 11:03 AM

Three Month Free Ration Distribution Delay E Pos Software Issue

అప్‌డేట్‌ కాని బయోమెట్రిక్‌తో కష్టాలు  

మొరాయిస్తున్న ఈ–పోస్‌ సాఫ్ట్‌వేర్‌   

బారులు తీరుతున్న కార్డుదారులు 

ప్రహసనంగా మూడు నెలల రేషన్‌

సాక్షి,  హైదరాబాద్‌: ఒకేసారి మూడు నెలల ( ఏప్రిల్, మే, జూన్‌) ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రహసనంగా మారింది. ఈ– పోస్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కాకపోవడంతో కాలయాపన జరుగుతోంది. గతంలో కరోనా సంక్షోభ సమయంలో ఇదే తరహాలో మూడు నెలల బియ్యం పంపిణీ చేసినప్పుడు ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి ఒకే బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌తో పంపిణీని సులభతరం చేసింది. ప్రస్తుతం పంపిణీలో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కాకపోవడంతో పాత పద్ధతినే అనుసరిస్తున్నారు.  ప్రతి కార్డుదారు మూడు విడతల బియ్యం కోసం ఈ–పోస్‌ యంత్రంపై మూడుసార్లు వేలిముద్ర వేయాల్సి వస్తోంది. వేయింగ్‌ మిషన్‌పైనా మూడుసార్లు తూకం వేయడం అనివార్యమైంది.  

ఒక్కొక్కరికి పది నిమిషాలు.. తప్పని నిరీక్షణ 
సాధారణంగా ఒక కార్డుదారుడికి రేషష్‌  పంపిణీ చేయడానికి రెండు నిమిషాల సమయం సరిపోతుంది.  ప్రస్తుతం సాంకేతిక చిక్కులతో ఒక్కో కార్డుకు కనీసం 10 నిమిషాల సమయం పడుతోంది. వేలిముద్రలు పడకపోయినా, సర్వర్‌ నెమ్మదించినా ఈ సమయం మరింత పెరుగుతోంది. ఈ పోస్‌ యంత్రంతో అనుసంధానమైన వేయింగ్‌ మిషన్‌పై తూకం వేయడం తప్పనిసరి. మొదటి నెల కోటా తూకం పూర్తై రసీదు వచ్చాక, మళ్లీ రెండో నెల కోసం బయోమెట్రిక్‌ వేయాలి, ఆపై మళ్లీ తూకం వేయాలి. ఇలా మూడుసార్లు చేయాల్సి వస్తోంది. 

గడువు ఉన్నా రద్దీ 
ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా  ఈ నెలలో మూడు నెలల బియ్యం పంపిణీ  ప్రక్రియ ఈ నెల 30 వరకు కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేసినప్పటికీ లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ‘ముందు వెళ్తేనే బియ్యం దొరుకుతాయి.. లేదంటే స్టాక్‌ అయిపోతుంది’ అన్న భయం కార్డుదారులను తెల్లవారుజాము నుంచే రేషన్‌ షాపుల వద్ద క్యూ కట్టేలా చేస్తోంది. ఇప్పటికైనా∙సాఫ్ట్‌వేర్‌లో తగిన మార్పులు చేస్తే తప్ప ఈ రద్దీ తగ్గేలా కనిపించడం లేదని డీలర్లు అభిప్రాయపడుతున్నారు.  

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement