ఐనవోలు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని పున్నేలు శివారు స్విమ్మింగ్ పూల్‌లో పడి తల్లీకూతుళ్లు మృతి చెందిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కేవలం అబార్షన్‌కు ఒప్పుకోకపోవడంతోనే భర్త అజారుద్దీన్ హత్యకు పాల్పడి ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా చిత్రీకరించాడా.. లేదా.. మరేదైనా హత్యకు దారితీశాయా అనే కోణంలో కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.
అజారుదీ్దన్ భార్యతోపాటు తమ్ముడి భార్య కూడా ఇటీవల గర్భవతి కాగా వారికి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించినట్లు సమాచారం. అయితే అజారుద్దీన్ భార్యకు ఆడపిల్ల, తమ్ముడి భార్యకు మగ పిల్లాడుగా తెలియడంతో అదే రోజు కుటుంబంలో చర్చ జరిగిందని, అక్కడే అజారుద్దీన్ భార్యకు గర్భం తొలగించాలని పట్టుపట్టి చివరికి ఆమె వినకపోవడంతో ప్లాన్ ప్రకారం హతమార్చాడని పోలీసులు భావిస్తున్నారు. అసలు గర్భధారణ సమయంలో లింగ నిర్ధారణ వీరికి ఎలా తెలుస్తోంది.. ఇంతకుముందు రెండుసార్లు ఎక్కడ అబార్షన్ చేయించారు. సహకరించేది ఎవరు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.
ప్లాన్ ప్రకారం చేసిన హత్యగా ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు భార్య, కూతుర్లను అజారుద్దీన్ ఏవిధంగా హతమార్చి ఉంటాడో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్లు సమాచారం. నిందితుడితోపాటు ఆయన తల్లిదండ్రులు, తమ్ముడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతుండగా మరి కొంతమందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
పాపం.. పసి పిల్లలు
తల్లి, కూతుర్ల మృతిలో ముక్కుపచ్చలారని పసి పిల్లలు చేసిన తప్పేంటని అభం శుభం తెలియని పసి పిల్లలు బలయ్యారంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. గ్రామంలో స్థితి మంతమైన కుటుంబం కావడంతో పసి పిల్లల సంరక్షణకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవని, చలాకీగా ఉండే అమాయక పసిపిల్లలు మృతిచెందారనే అంశం అటు వారు చదివే పాఠశాలలోనూ. ఇటు గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


