
రద్దీ రూట్లలో బస్సుల కొరత
శివారు కాలనీలకు అరకొర సేవలు
రోజు రోజుకూ ప్రజారవాణా తగ్గుముఖం
సాక్షి, హైదరాబాద్: నగరశివారులకు ఆర్టీసీ సిటీ బస్సుల కొరత తీవ్రంగా ఉంది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్య లేదు. సిటీ బస్సుల కొరత ప్రజారవాణాకు సవాల్‌గా మారింది. సరిపడా బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ ఉన్న వందల కొద్దీ కాలనీలకు ప్రజారవాణా సదుపాయం అరకొరగా ఉంది. మరోవైపు ప్రయాణికుల రద్దీ ఉన్న రూట్లలో డిమాండ్ మేరకు బస్సులు లేవు.
బస్టాపుల్లో ప్రయాణికులు చాలాసేపు పడిగాపులు కాయాల్సి వస్తోంది. గంటకు ఒక బస్సు కూడా అందుబాటులో ఉండటం లేదని, ఎప్పుడో ఒకసారి వచ్చే బస్సులో కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోందని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోఠి నుంచి లింగంపల్లి వైపు రాకపోకలు సాగించే రూట్(216)లో ప్రయాణికుల డిమాండ్ భారీగా ఉంటుంది. ఈ బస్సు కోఠి నుంచి టోలిచౌకి, కాజాగూడ, ల్యాంకో హిల్స్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చి»ౌలి చౌరస్తా నుంచి లింగంపల్లి వరకు రాకపోకలు సాగిస్తుంది. సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులతోపాటు పలు ఐటీ సంస్థల ఉద్యోగులు కూడా ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తారు.
ట్రిప్పులు తగ్గుముఖం...
కాంప్రహెన్సివ్ మొబిలిటీప్లాన్(సీఎంపీ)పై హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన లీ అసోసియేషన్ అధ్య యనం ప్రకారం సుమారు 7,250 చదరపు కిలోమీటర్ల పరిధిలో అనేక కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్థుల భవనాలు విస్తరిస్తున్నా యి. నగర జనాభా సైతం 2 కోట్లకు చేరువవుతోంది. ఈ క్రమంలో ప్రజల అవసరాల మేరకు రవాణా సదుపాయాలు పెరగాల్సి ఉండగా ఈ దిశగా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. దేశంలోని పలు మెట్రోపాలిటన్ నగరాల్లో ఇప్పటికే మెట్రో రైలు రెండు, మూడో దశలను పూర్తి చేసుకుంది.
హైదరాబాద్‌లో మాత్రం రెండోదశకే ఆటంకాలు ఎదురవుతున్నాయి. లీ అధ్యయనం మేరకు 2050 నాటికి 665 కి.మీ.లకు పైగా మెట్రో విస్తరణ చేపట్టాల్సి ఉంది. అదే సమయంలో ఇప్పుడున్న జనాభా మేరకు కనీసం 10 వేల పర్యావరణహిత బస్సులు అవసరం. కానీ, 2,800 బస్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 250 మాత్రమే. ఇప్పటికిప్పుడు ప్రయాణికుల డిమాండ్ మేరకు 6 వేల బస్సులను సమకూర్చాల్సి ఉందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఉన్న బస్సులు, ట్రిప్పులతో 20 లక్షల మందికి కూడా సేవలు లభించడం లేదు. నగరంలో మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన తరువాత అనూహ్యంగా డిమాండ్ పెరిగింది.
ఉదయం, సాయంత్రాలు మాత్రమే..
ఘట్‌కేసర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, కుత్బుల్లాపూర్, చేవెళ్ల, మొయినాబాద్ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు, విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు నిరంతరం రాకపోకలు సాగిస్తున్నారు. కానీ, చాలా కాలనీలకు ఉదయం, సాయంత్రం మాత్రమే రెండు, మూడు బస్సులు నడుస్తున్నాయి. మిగతా సమయాల్లో ప్రయాణికులు సెవెన్ సీటర్ ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఐటీ కారిడార్‌లలోని ఉద్యోగుల కోసం బస్సుల సంఖ్యను పెంచినట్లుగానే నగర శివారు ప్రాంతాల్లో ఉన్న కాలనీలకు కూడా ట్రిప్పులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.