
ఖాజాగూడ, ట్రిపుల్ ఐటీ జంక్షన్ల వద్ద.. రెండు రహదారుల విస్తరణ సైతం..
రూ.650 కోట్లతో టెండర్లు పిలిచిన జీహెచ్‌ఎంసీ
ట్రాఫిక్ సమస్య పరిష్కారమే ప్రధాన లక్ష్యం
సాక్షి, సిటీబ్యూరో: హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) పనుల్లో భాగంగా రెండు జంక్షన్ల వద్ద నాలుగు ఫ్లై ఓవర్లు.. రెండు అండర్‌పాస్‌లు.. రెండు రహదారుల విస్తరణ, అభివృద్ధి పనుల కోసం జీహెచ్‌ఎంసీ (GHMC) జాతీయ స్థాయి టెండర్లను పిలిచింది. ఈ పనుల నిర్మాణ వ్యయం దాదాపు రూ. 650 కోట్లు. టెండర్ల దాఖలుకు చివరి తేదీ వచ్చే నెల 9.
గ్రేటర్ నగరంలో సిగ్నల్ ఫ్రీ (Signal Free) ప్రయాణం కోసం ఇప్పటికే ఎన్నో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు (Underpass) తదితర వసతులు అందుబాటులోకి వచ్చాయి. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మరిన్ని ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించేందుకు సిద్ధమైన ప్రభుత్వం దాదాపు రూ.2,400 కోట్ల మేర పనులు చేపట్టాల్సిందిగా ఇటీవల జీహెచ్‌ఎంసీని ఆదేశించింది.
అందుకనుగుణంగా ఇప్పటికే కేబీఆర్ పార్కు (KBR Park) పరిసరాల్లో కొన్ని స్టీల్ ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఫాక్స్ సాగర్ నాలా వద్ద ఫ్లై ఓవర్ పనులకు టెండర్లు ఆహ్వానించిన జీహెచ్‌ఎంసీ.. తాజాగా ఖాజాగూడ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్ల వద్ద మరికొన్ని ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లకు టెండర్లు ఆహ్వానించింది.
వీటితో పాటు సైబరాబాద్ సీపీ కార్యాలయం నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు 215 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ, అంజయ్యనగర్ నుంచి రాంకీ టవర్ రోడ్ వరకు 150 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ పనులకు టెండర్లు పిలిచింది. జీహెచ్‌ఎంసీ నుంచి కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ నిధులు చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ పనుల్ని రెండేళ్లలో పూర్తి చేయాల్సిందిగా టెండరు నిబంధనల్లో పేర్కొంది. పనులు పూర్తయ్యాక రెండేళ్లపాటు అవసరాన్ని బట్టి మరమ్మతులు వంటివి చేయాల్సి ఉంటుంది.
తాజాగా టెండర్లు పిలిచిన పనులు ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద..
→ ఐఎస్‌బీ నుంచి డీఎల్‌ఎఫ్ రోడ్ వరకు రెండు వైపులా ప్రయాణానికి మొదటి వరుస ఫ్లై ఓవర్. నాలుగు లేన్లు. క్యారేజ్ వే వెడల్పు 7.5 మీటర్లు.
→ ఐఎస్‌బీ నుంచి గచ్చిబౌలి వెళ్లేందుకు రెండో వరుసలో మరో ఫ్లై ఓవర్. మూడు లేన్లుగా ప్రయాణం. క్యారేజ్‌వే వెడల్పు 11 మీటర్లు.
→ డీఎల్‌ఎఫ్ నుంచి బీహెచ్‌ఈఎల్ రోడ్ వైపు వెళ్లేందుకు రెండో వరుసలో మూడు లేన్ల ఫ్లై ఓవర్. క్యారేజ్‌వే వెడల్పు 11 మీటర్లు.
→ గచ్చిబౌలి నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు రెండు వైపులా ప్రయాణానికి ఆరు లేన్లతో అండర్ పాస్. 11 మీటర్ల క్యారేజ్‌వే. వరద నీరు పోయే మార్గాలతో పాటు 2 లక్షల నీటి సామర్థ్యంతో సంప్ నిర్మాణం.
ఖాజాగూడ జంక్షన్ వద్ద..
→ నానక్‌రామ్‌గూడ – టోలిచౌకి రోడ్ వరకు మూడు లేన్లతో ఫ్లై ఓవర్. క్యారేజ్‌వే 9.5 మీటర్లు.
→ టోలిచౌకి రోడ్– బయోడైవర్సిటీ వరకు మూడు లేన్లతో అండర్‌పాస్. క్యారేజ్‌వే 11 మీటర్లు. రెండు వైపులా ఫుట్‌పాత్‌లతో పాటు వాటి కింద డక్ట్ నిర్మాణం. వరదనీరు పోయే మార్గాలతో పాటు సంప్ నిర్మాణం.
→ ఈ పనులతో పాటు ఆయా జంక్షన్ల వద్ద రోడ్ల పునరుద్ధరణ, ఫుట్‌పాత్‌లు, లైటింగ్, ఇతరత్రా సదుపాయాలతో ఆధునికీకరణ. సైబరాబాద్ సీపీ కార్యాలయం – గచ్చిబౌలి జంక్షన్ వరకు, అంజయ్యనగర్ –రాంకీ టవర్ రోడ్ వరకు రోడ్లను వెడల్పు చేసి సాఫీగా ప్రయాణం సాగేలా ఆధునికీకరించాలి.
ఇదివరకే టెండర్లు పిలిచిన పనులు
ప్యాకేజీ – 1 కింద రూ. 580 కోట్ల అంచనా వ్యయంతో..
→ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్ వద్ద అండర్‌పాస్.
→ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 నుంచి కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ వరకు మొదటి వరుస ఫ్లై ఓవర్.
→ యూసుఫ్‌గూడ రోడ్ నుంచి రోడ్ నంబర్ 45 వరకు రెండో వరుస ఫ్లై ఓవర్.
→ కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ జంక్షన్ వద్ద జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ రోడ్ వరకు అండర్‌పాస్.
→ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ రోడ్ వరకు ఫ్లై ఓవర్.
→ ముగ్ధ జంక్షన్ వద్ద కేబీఆర్ ఎంట్రన్స్ రోడ్ నుంచి పంజగుట్ట రోడ్ వరకు అండర్‌పాస్.
ప్యాకేజీ–2 కింద.. రూ. 510 కోట్ల అంచనా వ్యయంతో..
→ రోడ్ నంబర్–45 జంక్షన్ వద్ద ఫిల్మ్‌నగర్ రోడ్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ రోడ్ వరకు అండర్‌పాస్.
→ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ రోడ్ నుంచి రోడ్ నంబర్ 45 వరకు ఫ్లై ఓవర్.
→ ఫిల్మ్‌నగర్ జంక్షన్ వద్ద మహారాజా అగ్రసేన్ జంక్షన్ రోడ్ నుంచి రోడ్ నంబర్ 45 జంక్షన్ వరకు అండర్‌పాస్.
→ ఫిల్మ్‌నగర్ రోడ్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ రోడ్ వరకు ఫ్లై ఓవర్.
→ మహారాజా అగ్రసేన్ జంక్షన్ వద్ద కేన్సర్ హాస్పిటల్ రోడ్ నుంచి ఫిల్మ్‌నగర్ రోడ్ వరకు అండర్‌పాస్.
→ ఫిల్మ్‌నగర్ రోడ్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 వరకు ఫ్లై ఓవర్.
→ కేన్సర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ రోడ్ వరకు అండర్‌పాస్.
→ మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 వరకు ఫ్లై ఓవర్.
→ ఆయా ఫ్లై ఓవర్ల నిర్మాణాలు పూర్తయితే కోర్ సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి పశ్చిమం వైపు.. ఐటీ కారిడార్లకు రాకపోకలు చేసేవారికి సమయం, వ్యయ ప్రయాసలు తప్పుతాయని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment