జేఈఈ అడ్వాన్స్‌డ్‌.. టాప్‌టెన్‌లో నలుగురు | Telugu students Tops in JEE Advanced too | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్‌డ్‌.. టాప్‌టెన్‌లో నలుగురు

Jun 2 2026 1:37 AM | Updated on Jun 2 2026 1:37 AM

Telugu students Tops in JEE Advanced too

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ తెలుగు విద్యార్థుల దూకుడు

రెండు వేల లోపు ర్యాంకుల్లో 284 మంది 

వంద పర్సంటైల్‌లోనూ మెజారిటీ

జాతీయ టాపర్‌ ఢిల్లీ విద్యార్థి శుభమ్‌ కుమార్‌.. నేటి నుంచి జోసా కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్లు

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు దూకుడు ప్రదర్శించారు. మొదటి పది ర్యాంకుల్లో మద్రాస్‌ జోన్‌ పరిధిలో రాసిన ముగ్గురు, బాంబే జోన్‌ నుంచి రాసిన మరొకరు... మొత్తంగా నలుగురు టాప్‌–10లో విజేతలుగా నిలిచారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మోహిత్‌ శేఖర్‌ శుక్లా (319 మార్కులు) 4వ స్థానం, కూచి సందీప్‌ (విశాఖ) (318 మార్కులు) 5వ స్థానం, మేడిశెట్టి నాగ సహర్ష (312 మార్కులు) 9వ స్థానం పొందారు. ఐఐటీ–బాంబే నుంచి పరీక్ష రాసిన మరో తెలుగు విద్యార్థి జయకృష్ణ శ్రీనివాస్‌ 6వ ర్యాంకు సాధించారు. ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన శుభమ్‌ కుమార్‌ 360 మార్కులకు 330 సాధించి ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. 

బాలికల విభాగంలో ఐఐటీ ఢిల్లీకే చెందిన అరోహి దేశ్‌పాండే జాతీయ టాపర్‌గా చోటు దక్కించుకుంది. అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలను అధికారులు సోమవారం విడుదల చేశారు. దేశంలో 23 ఐఐటీల్లో బీటెక్‌లో ప్రవేశానికి ఐఐటీ–రూర్కీ మే 17న దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించింది. జేఈఈ మెయిన్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేశారు. వీరిలో బీటెక్, బీఆర్క్‌ రెండు పేపర్లకు కలిపి 1,87,389 మంది అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. 1,79,694 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తంగా 56,880 మంది అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించారు. బాలురులో 46,773 మంది అర్హత సాధిస్తే, బాలికల్లో 10,107 మంది అర్హత సాధించారు. ట్రాన్స్‌జెండర్‌ ఒకరు పరీక్ష రాయగా, అర్హత పొందలేదు.  

మనోళ్లలో 10 మందికి 100 పర్సంటైల్‌ 
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల్లో ఓబీసీ–ఎన్‌సీఎల్‌–పీడబ్ల్యూడీ విభాగంలో ఐఐటీ మద్రాస్‌ జోన్‌కు చెందిన నానాల నాగచైతన్య, జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌లో బి.జయకృష్ణ శ్రీనివాస్‌ టాపర్లుగా నిలిచారు. మద్రాస్‌ జోన్‌ నుంచి వెల్దుర్తి హర్షిత్‌ 15వ ర్యాంక్, భవనేశ్వర్‌ జోన్‌ నుంచి రెడ్డి సాయిసాహితి 230 ర్యాంక్‌ పొందారు. జాతీయ స్థాయిలో 26 మందికి వంద పర్సంటైల్‌ రాగా.. వారిలో తెలుగు తేజాలు 10 మంది ఉన్నారు. 2 వేల లోపు ర్యాంకులు దక్కించుకున్న వారిలో 284 మంది మంది తెలుగువారే. 100 పర్సంటైల్‌ వచ్చిన వారిలో తెలుగు విద్యార్థులు మంథా శివ కామేశ్, దొరనాల భవితేశ్‌రెడ్డి, సాయి రిత్విక్‌ రెడ్డి, వివాన్‌ శరద్‌ మహేశ్వరి, రిషి ప్రేమ్‌నాథ్, జొన్నల రోషన్‌ మణిదీప్‌రెడ్డి, నరేంద్రబాబుగారి మహిత్, తుంగా దుర్గా సుప్రభాత్, పసల మోహిత్, బిజ్జం వెంకట చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు.  

అత్యధికంగా ఐఐటీ–బాంబే నుంచి.. 
జోన్ల వారీగా చూస్తే ఐఐటీ బాంబే నుంచి అత్యధికంగా 12,389 మంది అర్హత సాధించారు. ఆ తర్వాత ఐఐటీ మద్రాస్‌ 14,294, ఐఐటీ ఢిల్లీ 10,697, ఐఐటీ రూర్కీ 5,637, ఐఐటీ కాన్పూర్‌ 5,552, ఐఐటీ భువనేశ్వర్‌ 5,428, ఐఐటీ గౌహతి 2,883 మంది ఉన్నారు. టాప్‌–100లో ఐఐటీ మద్రాస్‌ నుంచి 35 మంది, ఢిల్లీ 29, బాంబే 23, రూర్కీ నుంచి 9 మంది, కాన్పూర్‌ నుంచి ముగ్గురు, భువనేశ్వర్‌ నుంచి ఒకరు ఉన్నారు. టాప్‌–100లో దాదాపు 30 మంది తెలుగు విద్యార్థులు వివిధ జోన్లలో మంచి ర్యాంకులు సాధించారు. జూన్‌ 2 నుంచి జోసా కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement