
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా ప్రస్థానం పాదయాత్రను ఈ నెల 28 నుంచి పునఃప్రారంభించనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై అధ్యయనం కోసం ఈ నెల11న పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో వైఎస్ షర్మిల మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
అనంతరం మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూడి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సత్తుపల్లి నుంచే మళ్లీ పాదయాత్ర మొదలవుతుందని తెలిపారు. దమ్ముంటే ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారో మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అవగాహనారాహిత్యంతో కులాల గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.