మెడికల్‌ కాలేజీల్లో ప్రొఫెసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ 

Telangana: Professor Posts Notification In Medical Colleges - Sakshi

ఏడాది కాలానికి కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకం 

ఈ నెల 9న ఇంటర్వ్యూలు.. 12న ఎంపికైనవారి జాబితా ప్రకటన 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రుల్లో ఏడాదిపాటు కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టులకోసం ఈ నెల 9వ తేదీన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచారు. ఎంపికైనవారి జాబితాను 12వ తేదీన విడుదల చేస్తారు. 19వ తేదీన వారికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో వెల్లడించారు.

ఈ పోస్టులకోసం దేశంలోని ఏ ప్రాంతంలోవారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే స్థానికులకు ప్రాధాన్యం ఇస్తామని వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి ఆ నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. 17 విభాగాలకు సంబంధించిన స్పెషలిస్టులను ఇంటర్వ్యూలకు ఆహ్వానించారు. మొత్తం పోస్టుల్లో అనాటమీ ప్రొఫెసర్‌ ఒకటి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఆరు ఉన్నాయి. ఫిజియాలజీలో ప్రొఫెసర్‌ మూడు, అసోసియేట్‌ 10 పోస్టులు ఉన్నాయి. ఫార్మకాలజీలో అసోసియేట్‌ ప్రొఫెసర్లకు 10 పోస్టులున్నాయి.

పాథాలజీలో 13 అసోసియేట్, మైక్రోబయాలజీలో ప్రొఫెసర్‌ 7, అసోసియేట్‌ 10 ఉన్నాయి. ఫోరెన్సిక్‌లో ప్రొఫెసర్‌ 7, అసోసియేట్‌ 16, కమ్యూనిటీ మెడిసిన్‌లో ప్రొఫెసర్‌ 4, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 15 పోస్టులు ఉన్నాయి. ఈఎన్‌టీలో ప్రొఫెసర్‌ 4, ఆప్తమాలజీ ప్రొఫెసర్‌ 7, జనరల్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ 8, రెస్పిరేటరీ మెడిసిన్‌లో ప్రొఫెసర్‌ 7, అసోసియేట్‌ 4 ఉన్నాయి. జనరల్‌ సర్జరీలో ప్రొఫెసర్‌ 7, డెర్మటాలజీ ప్రొఫెసర్‌ 6, సైకియాట్రీ ప్రొఫెసర్‌ 5, అసోసియేట్‌ 8 ఉన్నాయి.

ఆర్థోపెడిక్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 1, రేడియో డయోగ్నసిస్‌ ప్రొఫెసర్‌ 7, ఎమర్జెన్సీ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ 8, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 8 ఉన్నాయి. స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఇతర రాష్ట్రాల అభ్యర్థులను తీసుకుంటారు. నోటిఫికేషన్‌ విడుదల తేదీనాటికి దరఖాస్తుదారు వయసు 69 సంవత్సరాల కంటే తక్కువగా ఉండాలి. ఏదైనా ఇతర ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలలో పనిచేస్తున్న అభ్యర్థులు అదే కేడర్‌లోని కాంట్రాక్టు పోస్టుకు దరఖాస్తు చేయడానికి అనర్హులు. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1.90 లక్షలు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.50 లక్షలు ఇస్తారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌లకు నెలకు రూ. 50 వేలు వేతనం ఇస్తారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top