సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బాల్క సుమన్‌పై పలు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణభవన్‌లో ఉన్న బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నరు. ఈ సందర్భంగా తెలంగాణభవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం, బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గత మూడు రోజులుగా తెలంగాణ భవన్‌లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణభవన్ వద్దనే టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత మూడు రోజులుగా మోహరించారు. బాల్క సుమన్ భవన్ నుండి బయటికి వస్తే అరెస్టు చేయాలన్న ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలో కాసేపటి క్రితమే సుమన్ తరపు లాయర్ అక్కడికి చేరుకున్నారు. అలాగే, నాంపల్లి, టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. సుమన్‌కు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు.. బాల్క సుమన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 326, 351, 352, 353, 355, 361-BNS మరియు PDPP చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లను కేసులో చేర్చిన పోలీసులు. దీంతో, పోలీసులతో బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు. సుమన్‌పై అక్రమ కేసులు పెట్టారంటూ లాయర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి కోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటామంటున్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటామని న్యాయవాదుల హెచ్చరించారు. ఈ క్రమంలో భవన్ వద్ద పోలీసులకు, లాయర్లకు మధ్య చర్చలు, వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


